చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం
తిరుపతి, ఆగస్టు 9, వాయిస్ టుడే: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పోలవరం అంతా పరిశీలించారని, సెల్ఫీ కూడా తీసుకున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు. సెల్‌ఫోన్ కనిపెట్టిన చంద్రబాబుకు సెల్ఫీ తీసుకోవడం కష్టమవుతోందని, ఆ ఫోటో ఎలా వచ్చిందో మరి అంటూ ఎద్దేవా చేశారు. నువ్వు చేసిన తప్పు వల్లే ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని, చంద్రబాబు అంతరాత్మ చెప్పే ఉంటుందని మంత్రి అంబటి పేర్కొన్నారు.మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు చంద్రబాబు నాయుడు. 2004 వరకు 9 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించ లేదు. రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు పోలవరాన్ని చంద్రబాబు తన బ్రెయిన్ ఛైల్డ్ అంటున్నాడు. నవయుగ కాంట్రాక్టర్‌ను మార్చాం అనే బాధ చంద్రబాబుకు, ఆయనకు మద్దతు ధర ఇచ్చే మీడియాకు ఉంది. ప్రాజెక్టు అంచనాలను పెంచి సొంత మనుషులకు ఇచ్చింది చంద్రబాబు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా సన్నిహితుడని తప్పుడు రాతలు రాస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా దగ్గర ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత మా బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాకు సన్నిహితుడని ఎలా చెబుతారు.” అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.
“లోకేష్ మా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తప్పేం ఉంది. ఎక్కడకు వెళితే అక్కడ ఏదో ఒకటి మాట్లాడటం లోకేష్‌కు అలవాటు. చంద్రబాబుపై హత్యాయత్నం జరగలేదు. చంద్రబాబు సమక్షంలోనే పోలీసులు, మా పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం జరిగింది ఒక కానిస్టేబుల్ కళ్ళు పోయాయి. దీనికి బాధ్యులు ఎవరు?. అధికారంలో ఉంటే చంద్రబాబుకు శాంతి కావాలి ప్రతిపక్షంలో ఉంటే విధ్వంసం కావాలి. చంద్రబాబుపై కేసు పెట్టకపోతే రాజ్యాంగం లేనట్లే చట్టం లేనట్లే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చట్టాన్ని గౌరవించాలి. చంద్రబాబు జాగ్రత్త చట్టం ముందు అందరూ సమానమే. చంద్రబాబు అయినా ఆయన బాబు అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకూడదన్నావ్‌గా చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ గుర్తుకు వచ్చిందా??. చంద్రబాబుకు అర్జెంటుగా అధికారం కావాలి.” అని అంబటి రాంబాబు వెల్లడించారు. చిరంజీవి అంటే తమకు గౌరవం ఉందని.. కానీ ఆయన అలా మాట్లాడవచ్చా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పండి అన్నయ్య అని ఆయన అన్నారు. నన్ను ఎవరైనా అంటే తల వంచుకుని పోయే మనస్తత్వం కాదని అంబటి అన్నారు. చిరంజీవి అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. ముద్రగడపై చంద్రబాబు దాడులకు పాల్పడుతున్న సమయంలో తాను పిలిస్తే దాసరి, చిరంజీవి ఇద్దరూ వచ్చారన్నారు. చంద్రబాబు తీరును ఇద్దరూ తప్పుబట్టారని ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.