అంతా తానై…
విజయవాడ ఫిబ్రవరి 26, (వాయిస్ టుడే)
Everything is...
నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు. గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం వెనక కూడా లోకేష్ కృషి ఉంది. యువగళం పాదయాత్రతో రాష్ట్ర మంతటా పర్యటించడమే కాకుండా యువనేతలను అభ్యర్థులుగా ఎంపిక చేయడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లోకేష్ ముఖ్యమైన ఐటీ, విద్యాశాఖలను అడిగి మరీ తీసుకున్నారు. విద్యాశాఖ అన్ని శాఖల్లో ముఖ్యమైనది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిరంతరం సర్కస్ చేయాల్సి ఉంటుంది. అతి కీలకమైన సున్నితమైన శాఖ కావడంతో ఈ శాఖను డీల్ చేయడం అంత ఆషామాషీ కాదు.అంతేకాకుండా బడ్జెట్ లో ఈ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి వస్తుంది. అనేక పథకాలు ఈ శాఖలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా తల్లికి వందనం పథకంతో పాటు ఫీజు రీఎంబర్స్ మెంట్, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, ఉపాధ్యాయుల బదిలీలు.. వేతనాలు సకాలంలో చెల్లించడం, వారి డిమాండ్లను నెరవేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ శాఖలో నలిగిన వారు ఎవరైనా సరే మరోశాఖను దేనినైనా సులువుగా డీల్ చేయగలరన్నది ప్రభుత్వంలో ఎవరైనా అంగీకరించే విషయమే. అందుకే ఈ బడ్జెట్ లో తన శాఖకు సంబంధించిన నిధులను కేటాయింపు జరగడంలో లోకేష్ ముందుంటారని అందరూ చెబుతున్నారు. ఇప్పటికే తల్లికి వందనం ఆలస్యం కావడంతో ఇక ఈ బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరిగి తీరుతుంది.పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను కూడా లోకేష్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. చంద్రబాబు అలా వచ్చి ఒకసారి వెళ్లి ప్రసంగించి వెళ్లడమే కానీ, ముఖ్యమైన నేతలతో సమావేశాలు, జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం వంటి వాటిలో లోకేష్ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం లోకేష్ ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. టీమ్ అన్ని రకాలుగా సర్వేలు చేసిన తర్వాతే వారికి నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తున్నారు. అసంతృప్తులు వస్తాయని తెలిసినా పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోవడం లోకేష్ కు సవాల్ గా మారింది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ లోకేశ్ పాత్రను ఎవరూ కాదనలేరు.పార్టీ పరంగా కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ పైనే ఉంది. చంద్రబాబు నాయుడు దృష్టికి కొన్ని వెళతాయి. మరికొన్ని వెళ్లవు. కానీ లోకేష్ టీంకి మాత్రం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కూటమిని గెలిపించే బాధ్యతను తాను తీసుకున్నారు. చంద్రబాబు కు కొంత వెసులుబాటు కల్పించి ఆయనను పరిపాలనపై దృష్టి పెట్టేందుకు లోకేష్ పార్టీ కార్యక్రమాలన్నీ అంతా తానే అయి చూస్తున్నారు. దీంతో పాటు ఉండవల్లిలోని నివాసంలో ప్రజాదర్బార్ పేరిట ప్రజలను కలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ వారి మన్ననలను పొందుతున్నారు. ఢిల్లీలో కూడా పనులు చక్కబెట్టేందుకు రెడీ అయ్యారు. ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు విమర్శించినా లోకేష్ మాత్రం ఇప్పుడు టీడీపీలో నెంబర్ వన్ అని సీనియర్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.