- Advertisement -
సాగు చేసే రైతులకే భరోసా
Farmers are assured
నిజామాబాద్, జనవరి 8, (వాయిస్ టుడే)
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించింది. రైతు భరోసా ఇన్ని ఎకరాలకు మాత్రమే అనే పరిమితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. రైతులు, రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించి…వారి అభిప్రాయాలు సేకరించారు. చివరకు ఎలాంటి పరిమితి లేకుండా సాగు చేస్తు్న్న ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది.వ్యవసాయం చేస్తున్న, సాగు చేసేందుకు అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాళ్లు, గుట్టలు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, రోడ్లు, వెంచర్ల వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేసింది. ఇలాంటి భూములున్న వారికి రైతు భరోసా దక్కదు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి పొలాలు ఉంటే వారికి కూడా రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పథకంపై పూర్తి విధి విధానాలు విడుదలైతే గానీ మరిన్ని విషయాలపై స్పష్టత రాదు.కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు అందిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఏటా రూ.10 వేలు జమ చేసేంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెట్టుబడి సాయంగా రూ.12 వేలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా నిధులను రెండు విడతలుగా జమ చేయనుంది. మొదటి విడతను 2025 జనవరి 26న గణతంత్ర దినోత్సవం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అంటే తొలి విడతలో ఎకరానికి రూ.6,000 చొప్పున జమచేస్తారు. నిధులు విడుదలైన నాటి నుంచి పదిరోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.”రైతు భరోసాపై వేలాది మంది రైతుల అభిప్రాయాలను సేకరించాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఎకరానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం. కేసీఆర్ 200 ఎకరాలు సాగు చేస్తే 200 ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తాం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యల నేపథ్యంలో రైతు భరోసా ఇన్ని ఎకరాలకు పరిమితి లేదని స్పష్టం అవుతుంది.
రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.7,800 కోట్ల దాకా కేటాయించాల్సి ఉంటుంది. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు అందించనున్నారు. ఈ పథకానికి రూ.12,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఈ రెండు పథకాలకు దాదాపు రూ.20 వేల కోట్లు జనవరి 25 లోపు ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1.53 కోటి ఎకరాలకు రైతు బంధు కింద నగదు జమ చేసేది. రైతు బంధు స్కీమ్ లో 69 లక్షల మంది సాయం పొందారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం చేయాలని అంచనా వేయగా…దాదాపు 1 కోటి 30 లక్షల ఎకరాలకు లెక్కతేలిందని అంచనా. దీంతో మొత్తం 62 లక్షల మంది రైతులకు జనవరి 26 నుంచి ఖాతాల్లో నగదు జమ కానుంది.
- Advertisement -