ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
18 లక్షల చెక్కులు అందజేత

ఖమ్మం, జూలై, 30: అనారోగ్యం పాలై మెరుగైన వైద్యం చేయించుకోడానికి ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి నిరుపేద వినియోగించుకోవాలని కోరారు.
తన సిఫారసు మేరకు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన
సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్ర పంపిణీ చేశారు. సుమారు 23 మందికి 18 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ… నియోజకవర్గానికి ఓ సర్కారు ఆసుపత్రులను కట్టిస్తున్నారని చెప్పారు.
అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు.. నియోజకవర్గానికో డయాలిసిస్ సెంటర్ వచ్చిందని అన్నారు. జిల్లాలో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. ప్రతిదానికి హైదరాబాద్ కు వెళ్లాల్సిన పనిలేకుండానే మన జిల్లా ప్రధానాసుపత్రిలోనే అన్ని సేవలు అందుతున్నాయని చెప్పారు. నిత్యం పేదల గురించి ఆలోచించే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని తిరిగి మూడో సారి గెలిపించుకోవాలని ఎంపీ రవిచంద్ర కోరారు. కార్యక్రమంలో బొమ్మెర రాంమూర్తి, ఆకుల గాంధీ, లింగాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.