నాలుగో సారి విజయం కోసం గంగుల ప్రయత్నం
బండి సంజయ్ కూడా కరీంనగర్ నుంచే పోటీ!
కాంగ్రెస్ నుంచి రేసులో నరేందర్ రెడ్డి, రోహిత్ రావు
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గాల్లో ఒకటిగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నిలుస్తోంది. గతంలో ఎందరో హేమాహేమీ నేతలకు విజయాన్ని, పదవులను అందించిన కరీంనగర్ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరి పక్షాన ఉంటుందనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు నిలబడే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.
నాలుగో సారి గెలుపు కోసం గంగుల
కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి.. ప్రస్తుతం మంత్రి పదవి కూడా నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ నేత గంగుల కమలాకర్.. నాలుగోసారి కూడా గెలవాలనే కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన విజయావకాశాలపై సర్వే కూడా చేయించుకున్నారని.. అందులో తనదే విజయం అనే అభిప్రాయం వ్యక్తం అవడంతో.. ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. గత ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీనంగర్ ఎంపీ బండి సంజయ్‌పై గెలిచిన ట్రాక్ రికార్డ్ కూడా ఉండడంతో ఆయన తనకు అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు నెలకొన్నాయనే ధీమాతో అడుగులు వేస్తున్నారు.
వాస్తవానికి 2009లో టీడీపీ నుంచి గెలిచిన గంగుల తర్వాత 2014లో బీఆర్‌ఎస్ కండువా కప్పుకుని 2014, 2018 ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించారు. 2014లో 24,754 ఓట్ల మెజారిటీ, 2018లో 14,974 ఓట్ల మెజారిటీతో రెండు సార్లు బండి సంజయ్ పైనే గెలవడం గమనార్హం. ఈ సారి కూడా ఓటర్లు ఇదే రీతిలో తనను ఆదరిస్తారనే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది.
బీజేపీ నుంచి బండి?
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో.. ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ.. బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ పోటీ చేయడం ఖరారైందనే అంశం. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆకాంక్షిస్తున్నట్లు.. ఈ మేరకు అధిష్టానానికి సైతం తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి అధిష్టానం కూడా ఓకే అందనే సమాచారం. దీంతో.. గంగులపై రెండుసార్లు ఓడిన బండి సంజయ్.. ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో క్షేత్రస్థాయి నాయకులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో తాను చేసిన పాదయాత్ర.. జిల్లా పరిధిలో తనకు లభించిన ప్రజల మద్దతు కూడా తనకు విజయం అందిస్తునే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీ
ఇక.. బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీని పరిగణనలోకి తీసుకుంటే.. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఈ పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 19 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావుల మధ్య టికెట్ కోసం పోటా పోటీ పోరు సాగుతోంది. పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ మనవడు అయిన రోహిత్ రావు.. ఎమ్మెస్సార్‌కు ఉన్న ఇమేజ్‌ను కొనసాగిస్తూ.. నిజయోజకవర్గంలో చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరొందిన పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు.
కాంగ్రెస్ నేతల బల ప్రదర్శనలు
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నరేందర్ రెడ్డి, రోహిత్ రావులు ఇద్దరూ ఇప్పటికే బల ప్రదర్శనలు చేయడంలో బిజీగా గడుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు టికెట్ తనకే అన్న ధీమాతో ఉన్న నరేందర్‌రెడ్డికి.. గత నవంబర్‌లో రోహిత్‌రావు రాకతో.. పోటీ నెలకొందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రోహిత్ రావు.. తన తాత ఎమ్మెస్సార్‌కు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఈయనకు పార్టీకే చెందిన మరో బలమైన బీసీ నేత పొన్నం ప్రభాకర్ కూడా మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. పార్టీలో ఎలాంటి కీలక పదవి లేదని అలకబూనిన పొన్నం.. రాష్ట్ర నాయకత్వానికి చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్ కీలక నేత బి. వినోద్‌ను సైతం ఓడించిన ఘనత పొందిన తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడం వెనుక పార్టీ రాష్ట్ర నాయకులే కారణమని భావిస్తున్నారని.. ఇదే కారణంతో రాష్ట్ర నాయకత్వం అండదండలున్న నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా, రోహిత్ రావుకు అనుకూలంగా పావులు కదుపుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈ రెండు వర్గాల నేతలే
ఇక.. కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు విజయం సాధించిన ఎమ్మెల్యేల సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుంటే.. వెలమ సామాజిక వర్గం నేతలే కనిపిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచిన గంగుల కమలాకర్ మున్నూరు కాపు వర్గానికి చెందిన నేత కావడం విశేషం. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి.. లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించడంతో కరీంనగర్ ఓటర్ నాడి పట్టుకోవడం కష్టంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అర్బన్ ఓటర్లే కీలకం
ఇక.. రానున్న ఎన్నికల్లో.. అర్బన్ ఓటర్లే.. అభ్యర్థుల విజయాన్ని నిర్ణయిస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మూడు లక్షలకు పైగా జనాభా ఉన్న కరీంగర్ నియోజకవర్గంలో అర్బన్ ఓటర్ల సంఖ్యే 80 శాతంగా ఉంది. అంతేకాకుండా కరీంనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. ఇక్కడ అసెంబ్లీ నియోజవర్గంలో ఓడి.. లోక్‌సభకు ఎన్నికైన నేతలు ఉన్నారు. ఇందుకు ఉదాహరణగా ఎమ్మెస్సార్, కేసీఆర్, సంజయ్‌లను పేర్కొనొచ్చు. అంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఓటర్లు ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో వారికే విజయం దక్కుతుందని తెలుస్తోంది. మరోవైపు ముస్లిం, బీసీ ఓటర్లు కూడా కీలకంగా నిలవనున్నారు. ముస్లిం ఓటర్ల సంఖ్య 60 వేలకు పైగా ఉందని, ఇతర బీసీ ఓటర్ల సంఖ్య లక్షన్నర వరకు ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. అర్బన్ ఓటర్లలోనూ బీసీలను మెప్పించే నేతలే గెలుస్తారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
మొత్తంగా చూస్తే.. ఈసారి కరీంనగర్‌లో త్రిముఖ పోరు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.