ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు
అందించేందుకే ప్రజాపాలన
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల
ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా ప్రజల ముంగిట యంత్రాంగం వెళ్లి దరఖాస్తులు తీసుకునేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం రోజున ధర్మపురి మండలం జైన గ్రామంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా ప్రజా పాలన నిర్వహించి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల, చేయూత ఐదు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి లబ్దిదారు నుండి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా రేషన్ కార్డు, మరే ఇతర సమస్యలపై కూడా దరఖాస్తు సమర్పించ వచ్చని తెలిపారు. నియోజక వర్గం లోని 2.25 లక్షల మందికి జవాబుదారిగా, సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని, ప్రతీ దరఖాస్తుకు రసీదు ఇవ్వాలని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం అయినప్పటికీ సాగునీరు అందడం లేదని, ఎస్ ఆర్ ఎస్ పి నుండి నీటి సరఫరాకు ఉన్నతాధికారులతో మాట్లాడాలని కలెక్టర్ ను కోరారు.ఆనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, నిజమైన అర్హులకు లబ్ది చేకూరేందుకు అధికారులు పని చేయాలని అన్నారు. ప్రజా పాలన నిర్వహణకు 190 టీమ్ లు ఏర్పాటు చేశామని, 3,500 కేంద్రాలలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతున్నాయని తెలిపారు. గురువారం నాటికి 2.67 లక్షల దరఖాస్తులు అందాయని, ఇందులో 48 వేలు ఇతర సమస్యలపై అందాయని వివరించారు. దరఖాస్తులను ఆన్ లైన్ చేయడానికి 500 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకుండా దరఖాస్తులను స్థానిక పంచాయతీ కార్యదర్శులకు, పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ అధికారులకు అందజేయవచ్చని తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి పథకం క్రింద 10 మందికి చెక్కులను విప్, కలెక్టర్ లు అందజేశారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్న ప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహ మూర్తి, నియోజక వర్గం ప్రత్యేక అధికారి కె.లక్ష్మి నారాయణ, మండల ప్రత్యేక అధికారి రహీమాన్, జడ్పిటిసి ,ఎంపిపి, సర్పంచు, ఉపసర్పంచ్, తహశీల్దార్, ఎంపిడివో, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.