టీఎస్‌పీఎస్సీ.. పరీక్షల కొత్త తేదీలివే
గ్రూప్-2 పరీక్ష కొత్త తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. తొలుత.. ఈ నెల 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. అయితే.. ఈ నెలలోనే గురుకుల పరీక్ష సైతం ఉండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. దాంతో సీఎం కేసీఆర్ పరీక్షను వాయిదా వేయాలని, తదుపరి తేదీలను ఖరారు చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
ప్రస్తుత పరీక్ష తేదీకి, కొత్త పరీక్ష తేదీకి మధ్య కనీసం రెండు నెలల సమయమైనా ఇవ్వాలని కమిషన్ భావించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రకటించారు. రెండు రోజులు.. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. పరీక్షకు వారంరోజుల ముందు నుంచి https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది నవంబర్ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.