హైదరాబాద్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): తెలంగాణ బీజేపీ తొలి జాబితా ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు అసతృప్తి వ్యక్తం చే్తున్నారు. టికెట్లు దక్కని ఆశావాహులు సైలెంట్ అవుతున్నారు. కొంత మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. నియోజకవర్గానికి పరిమితమై క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తీరా ఇప్పుడు ఆ స్థానాన్ని రావు పద్మకు కేటాయించారు. పార్టీ నాయకత్వంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మానకొండూరులో పార్టీ సీనియర్ నేత శంకర్‌కు కాకుండా ఇటీవల కొత్తగా చేరిన ఆరెపల్లి మోహన్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. రామగుండంలో ఇటీవల చేరిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణికి టికెట్ ఇచ్చింది. గోషామహల్ టికెట్ కేటాయిస్తామనే బలమైన హామీతోనే విక్రమ్‌గౌడ్ హస్తం పార్టీని వీడి కమలం గూటికి చేరారు. రాజాసింగ్‌పై వేటు, తదనంతర పరిణామాలతో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. తీరా తొలిజాబితాలో ఆయన స్థానంలో రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముథోల్ టికెట్ రాకపోవడంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్న తల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించారు.
అలాగే నందీశ్వర్‌గౌడ్‌కు పటాన్‌చెరు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న 8 మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు పటాన్‌చెరు అభ్యర్థిపై పునరాలోచన చేయాలని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణకు బీజేపీ మొండిచేయి చూపించింది. ఆ స్థానం నుంచి ఎంపీ అర్వింద్ సూచించిన ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాకు సీటిచ్చింది. అర్వింద్‌పై లక్ష్మినారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మెదట జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వం ప్రకటన బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. తనకు కచ్చితంగా ఆ సీటు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతున్నారు. జాతీయ నాయకత్వం మాత్రం ఆ సీటును మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దీనికి ఆయన సముఖంగా లేరు. తన కొడుక్కి ఆ సీటు ఇస్తే కచ్చితంగా గెలిపించుకుని వస్తానని చెబుతున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేక ఎన్నికల కమిటీ ఆ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రెండో జాబితా తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని బీజేపీ నేతలు కంగారు పడుతున్నారు.