సమస్యలపై ప్రశ్నిస్తే, పోలీసు నోటీసులా !
-ప్రభుత్వాన్ని నిలదీసిన యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్
బద్వేలు
సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసుల చేత నోటీసులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడం ఏంటని యుటిఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
జనవరి 25వ తేదీ విజయవాడలో జరిగే మునిసిపల్ ఉపాధ్యాయుల ధర్నాకు వెళ్ళకూడదంటూ తమ పాఠశాలకు వచ్చి పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా మాదన విజయ కుమార్ మాట్లాడుతూ మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని దీర్ఘకాలంగా ప్రభుత్వానికి పలుమార్లు ప్రాతినిధ్యాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించలేదన్నారు.
బదిలీలు, పదోన్నతులు చేపట్టకపోవడం మూలాన మున్సిపల్ ఉపాధ్యాయుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మునిసిపల్ పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలని, దీంతోపాటు మునిసిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని, గతంలో ఉన్న పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలని, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్స్ ప్రస్తుత డిడిఓ లకు అటాచ్ చేయాలని, అద్దె భవనాలలో నిర్వహిస్తున్న పాఠశాలలకు అద్దె చెల్లించాలని, కరెంటు బిల్లుల బకాయిలను చెల్లించాలని, మున్సిపల్ పాఠశాలలో నాన్ టీచింగ్ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అధికారులకు ఎన్నో మార్లు ప్రాతినిధ్యాలు చేశామన్నారు. ప్రాతినిధ్యాలు చేసినప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప, సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యుటిఎఫ్ ధర్నాకు పిలుపునిస్తే సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా యూటీఎఫ్ నాయకులను, ఉపాధ్యాయులను నిర్బంధించడం, నోటీసులు జారీ చేయడం తగదన్నారు. సమస్యలను పరిష్కరించకుండా పోలీసుల ద్వారా ఉద్యమాలను నిలువరించాలనుకుంటే ఈ ప్రభుత్వం తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నిర్బంధాలు ప్రయోగిస్తే తమ ఉద్యమం ఆగదని, మరింత తీవ్రతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.



