Friday, December 27, 2024

వారసులను బరిలో దింపే ఆలోచనలో… కోరుట్ల రాజకీయం

- Advertisement -

కోరుట్లలో ఎవరు పాగా వేస్తారో

మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు

బరిలోకి దిగనున్న వారసులు

ఇప్పటి వరకు అధిప్యతం కొనసాగించిన బీఆర్‌ఎస్‌

కోరుట్ల: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆసక్తికర పోరు సాగనున్న మరో నియోజకవర్గం కోరుట్ల. బుగ్గారం నియోజకవర్గం నుంచి విడిపడి.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం కూడా. అప్పటి నుంచి ఆధిపత్యం సాగిస్తున్న అధికార బీఆర్‌ఎస్‌ ఈసారి కూడా గెలుస్తుందా? కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటి? బీజేపీ ఎలా అడుగులు వేస్తోంది? అనే అంశాలపై విశ్లేషణ..

in-the-idea-of-putting-the-heirs-in-the-ring-korutla-politics
in-the-idea-of-putting-the-heirs-in-the-ring-korutla-politics

నాలుగు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌

ఈ నియోజకవర్గంలో 2009 నుంచి బీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్‌ రావు.. అప్పటి నుంచి 2018 వరకు జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికలు, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి కూడా బీఆర్‌ఎస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఆయనకే టికెట్‌ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెరపైకి విద్యాసాగర్‌ రావు తనయుడు

అధికార బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా కనిపిస్తున్న పరిణామం.. బీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులో విద్యాసాగర్‌ రావు తనయుడు సంజయ్‌ను బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలనే యోచనతో ఉన్న ఆయన తన తనయుడికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సంజయ్‌ కూడా ఇప్పటికే ఇంటింటికీ తిరుగుతూ తన ఉనికిని చాటుతున్నారు. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన సంజయ్‌.. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం, తండ్రి తరఫున నియోజకవర్గంలో పరిస్థితిని పరిశీలించడం, ప్రజల అవసరాలు, సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుంటూ వాటిలో సమస్యలుంటే తన తండ్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారనే పేరు పొందారు. దీంతో.. విద్యాసాగర్‌ రావు బదులు ఆయన తనయుడు సంజయ్‌కు టికెట్‌ ఇచ్చినా.. బీఆర్‌ఎస్‌ సునాయాసంగా గెలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

in-the-idea-of-putting-the-heirs-in-the-ring-korutla-politics
in-the-idea-of-putting-the-heirs-in-the-ring-korutla-politics

కాంగ్రెస్‌.. జువ్వాడకే

ఇక.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జూనియర్‌ జువ్వాడగా పేరు పొందిన జువ్వాడ నర్సింగ రావుకే ఈ సారి టికెట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జువ్వాడి రత్నాకర్‌రావు కుమారుడు అయిన నర్సింగరావు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా ఆయనకే టికెట్‌ లభిస్తుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. టికెట్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే దివంగత కొంరెడ్డి రాములు కుమారు కొంరెడ్డి కరం కూడా టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా టీపీసీసీ నాయకుడు కల్వకుంట్ల సుజిత్‌రావు కూడా టికెట్‌ రేసులో ఉన్నారనే సమాచారం. అయితే జువ్వాడకు ఉన్న అనుచర గణం, నియోజకవర్గ సమస్యలపై ఆయనకున్న అవగాహన వంటి కారణాలతో ఆయనకే టికెట్‌ ఇస్తారని తెలుస్తోంది. అయితే విద్యాసాగర్‌ రావు విషయంలో కోరుట్ల చక్కర ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయలేదనే వ్యతిరేకత, అదే విధంగా అయోధ్య రామ మందిరానికి విరాళాలు ఇవ్వద్దంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా మారాయి.

in-the-idea-of-putting-the-heirs-in-the-ring-korutla-politics
in-the-idea-of-putting-the-heirs-in-the-ring-korutla-politics

బీజేపీలోనూ వారసుల ఆశలు

మరోవైపు బీజేపీలోనూ ఈసారి వారసుల ఆశలు మోస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన జేఎన్‌ వెంకట్‌ ఈసారి ఆయన భార్య సునీతకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే విధంగా 2014 ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేసిన మరో నేత సురభి భూమ్‌రావు కూడా ఈ సారి తన కుమారుడు నవీన్‌ రావుకు టికెట్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో గత కొంత కాలంగా గ్రాఫ్‌ పెంచుకున్న బీజేపీలో.. ఇప్పుడు టికెట్ల పోటీ నెలకొనడంతో ఎవరికి అధిష్టానం ఆశీసులు ఉంటాయనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సారి వారసులను మినహాయిస్తారని, ఈ క్రమంలో వెంకట్‌కే మరోసారి టికెట్‌ అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో బీజేపీ హిందూ కార్డ్‌ అస్త్రంగా చేసుకుని అడుగులు వేస్తోంది.

మైనారిటీలను మచ్చిక చేసుకుంటున్న కాంగ్రెస్‌

ఇదిలా ఉండగా.. నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు కూడా గెలుపు నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో దాదాపు 20 శాతం దాదాపు 28 వేలకుపైగా ఉన్న మైనారిటీలు గత కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీనిని గమనించిన పార్టీ పెద్దలు ఇప్పుడు మైనారిటీ వర్గాలను ముఖ్యంగా ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నారు. అదే విధంగా మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపిస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ హామీ ఇస్తున్నారు.

కాంగ్రెస్‌కు కోవర్ట్‌ల సమస్య

ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుంటే పార్టీలో నియోజకవర్గంలో కోవర్టులున్నారనే వార్తలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పార్టీకి చెందిన మరో నేత సుజిత్‌ రావుపై విమర్శలు చేస్తున్న నర్సింగ రావు.. పార్టీలో కోవర్టులున్నారని.. మొదటి నుంచి ఉన్న వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే పార్టీ నష్టపోతుందని హెచ్చరించిన ఉందంతాలు కూడా ఉన్నాయి. దీంతో టికెట్‌ ఇచ్చే సమయానికి ఈ వివాదాలు పెరిగి నియోజకవర్గంలో ఓటర్ల ముందు అభాసుపాలు అవ్వాల్సి ఉంటుందేమో అనే బెంగ అధిష్టానంలో కనిపిస్తోంది.

వారి ఓట్లే కీలకం

ఇక నియోజకవర్గంలో మైనారిటీలతోపాటు పద్మశాలీలు, మున్నూరు కాపులు, ఎస్‌సీ ఓటర్లు కూడా కీలకంగా మారనున్నారు. వీరిలో మున్నూరు కాపులు 23 వేలకుపైగా, పద్మశాలీలు 30 వేల వరకు ఉంటారని అంచనా. ఇక.. గ్రామీణ ప్రాంతంలో గీతకార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్నారు. దీంతో.. వీరే గెలుపోటములను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో బీసీ, మైనారిటీల ఆదరణ పొందుతున్న బీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు ఉన్నాయని.. కాంగ్రెస్, బీజేపీలలో అంతర్గత విభేదాలు ఇబ్బందికరంగా మారుతున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కోరుట్ల నియోజకవర్గం ముఖ్యాంశాలు:

మొత్తం ఓటర్లు: 2.2 లక్షలు

బీసీ ఓటర్లు: దాదాపు 80 వేలు

ఎస్‌సీ ఓటర్లు: 35 వేలుగా అంచనా

గెలుపులో కీలకంగా పద్మశాలి, మున్నూరు కాపు వర్గం ఓట్లు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్