జిల్లాలో సంక్షేమ హాస్టళ్లలో సీట్లు పెంచాలి: పీడీఎస్యూ వరంగల్ జిల్లా కార్యవర్గం డిమాండ్
వరంగల్, ఆగస్టు 3 (వాయిస్ టుడే):
Increase seats in welfare hostels in the district: PDSU Warangal district committee demands.
వరంగల్ జిల్లా కేంద్రంలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) వరంగల్ జిల్లా కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలా అర్జున్ మాట్లాడుతూ, వరంగల్ జిల్లాకు గ్రామీణ ప్రాంతాల నుంచి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఆధారంగా ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లలో సరిపడా సీట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోందని, పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి సంక్షేమ హాస్టల్లో సీటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సంక్షేమ హాస్టళ్లలో సీట్ల కేటాయింపులో విఫలమైందని విమర్శించారు.
అలాగే జిల్లాలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు తగిన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందించాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ హాస్టళ్లలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మోక్షజ్ఞ, ముశ్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.




