హైదరాబాద్, నవంబర్ 3, (వాయిస్ టుడే): లక్ష30 వేల కోట్ల రూపాయల విలువ చేసే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో గండి పడింది. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోవడంతో అప్రతిష్ట పాలైన కెసీఆర్ ప్రభుత్వానికి మరో కొత్త సమస్య ఎదురైంది. తాజాగా అన్నారం బ్యారేజికి లీకేజి ఏర్పడింది. తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది. బ్యారేజ్ గేట్లు మూసేసినా కింద నుంచి ఊట ఉబికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 5.71 టీఎంసీల నీటిమట్టం ఉంది.
దీంతో ఒక గేటును ఎత్తి 2,357 టీఎంసీల నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు.మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ నెంబర్ 15 నుంచి 20 వరకు ఇటీవల కుంగిపోయింది. బ్యారేజీ గోడలకు పగుళ్లు వచ్చాయని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అధికారులు స్పందించి కుంగిన పిల్లర్లను పరిశీలించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించింది. కాగా, లక్ష్మీ బ్యారేజీ నిర్మాణ దశలోనే 20వ నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసి బ్యారేజీని ప్రారంభించారనే ఆరోపణలూ వినిపించాయి. తాజాగా పిల్లర్లు కుంగిపోవడంతో బ్యారేజీలోకి నీటి ఎత్తిపోతలను పంపులతో పోస్తున్నారు.