యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్న కమలదళం
హైదరాబాద్, మార్చి 7, (వాయిస్ టుడే )
Kamala Dalam is preparing an action plan.
తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచబోతోంది. మూడు ఎమ్మెల్సీల్లో రెండింటిలో విజయం సాధించి మూడో స్థానంపై కూడా ప్రభావం చూపింది. ఇదే జోష్ కంటిన్యూ చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే కొత్త నినాదాన్ని అందుకుంది. ఆ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నినదిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు ప్లాన్ బీని అమలు చేస్తోంది. సేవ్ తెలంగాణ – సపోర్ట్ బీజేపీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పదేళ్ల నుంచి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న సహాయం ప్రజలకు వివరించనున్నారు. ఇకపై వచ్చే ఎన్నికల అన్నింటిలో కూడా సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయడానికి రెడీ అయింది. అధికార పార్టీని కాదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదని బీజేపీ భావన. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ దిశగానే పార్టీ కార్యచరణ ఉండాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించలేదు. ప్రస్తుతానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు బీజేపీ భావజాలన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యక్తికి ఆ పగ్గాలు అప్పగించాలని కూడా చూస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస, బీఆర్‌ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం ఉద్ధృతం చేయబోతున్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై క్షేత్రస్థాయి నుంచే పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ కిషన్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నట్టు చెప్పిన ఆయన… బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పదేళ్లుగా జరుగుతున్న పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పాలకులే మారుతున్నారు తప్ప పాలన తీరు మారడం లేదని ఆయన విమర్శించారు. అందుకే ప్రజలకు కొత్త మార్గం చూపేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అందుకే తమ పార్టీని కూడా ప్రజల్లోకి మరింత స్పీడ్‌గా తీసుకెళ్తామన్నారు. ముందుగా సంస్థాగతంగా పార్టీ పదవులు భర్తీ వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నామని వివరించారు. ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లలే నేతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేసినా తమను ఓడించలేకపోయారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ఇకపై అసెంబ్లీలో, బయట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలి పెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. పసలేని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు. అయినా మారకుండా అదే రిపీట్ చేస్తే ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకునేందుకు బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో గురువారం ప్రెస్‌మీట్‌లో కిషన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. త్వరలోనే అన్ని పదవులు భర్తీ చేసి రాష్ట్ర కేడర్‌లో నయా జోష్ నింపుతారమన్నారు. ఇకపై నేతలంతా ప్రజల్లో ఉండి ప్రభుత్వాని ప్రశ్నిస్తూ వచ్చే ఎన్నికల లక్ష్యంగా పని చేయాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.