కర్ణాటక రాష్ట్రానికి రాజధాని బెంగుళూరు అయితే , కర్ణాటక సాంస్కృతిక రాజధాని మాత్రం మైసూరు అనే చెప్పాలి. నిజానికి , విజయదశమి పండుగ వస్తోందంటే చాలు , కర్ణాటక రాష్ట్రం అంతా పండుగే , మరీముఖ్యంగా , మైసూరు నగరం , ఆ ఉత్సవాలకు పెట్టింది పేరు . కర్ణాటక రాష్ట్ర చరిత్ర, సంస్కృతి , సంప్రదాయాలను మైసూరు లో జరిగే దసరా ఉత్సవాలు ప్రతిబింబిస్తాయి.
గత నాలుగు దశాబ్దాలుగా మైసూరు దసరా ఉత్సవాలు రంగ రంగ వైభవం జరుగుతున్నాయి . ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తం గా మైసూరు దసరా ఉత్సవాలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి . 1399 లో మైసూరు అరసు వంశస్థులు మైసూరు మహా సామ్రాజ్య చరిత్రను చాటి చెప్పడానికి శ్రీకారం చుట్టారు. రాజ వంశానికి చెందిన యదురాయ , కృష్ణ రాయ , మైసూరు దసరా ఉత్సవాలు ఘనం గా నిర్వహించారు . విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కన్నడ రాష్ట్రం వాడయార్ల పాలన లోకి వెళ్ళిపోయింది. క్రీ . శ . 1610 లో మొదటి సారిగా దసరా ఉత్సవాలు ప్రారంభించారు . 1659 లో అప్పటి దొడ్డ దేవరాజు ఆలయాన్ని పునర్నిర్మించి మెట్ల మార్గాన్ని ప్రారంభించారు . అప్పటినుంచి , మొదలైన ఉత్సవాలు నేటికీ విజయవంతంగా జరుగుతున్నాయి. ఏ ఉత్సవాల్లో మైసూరు లో కొలువై ఉన్న శ్రీచాముండీ అమ్మ వారికి , 12 రోజులు ఆభరణాలు అలంకరించి ఉత్సవాలు చేస్తారు. 1905 వ సంవత్సరం లో రాజభవనం లో దసరా రోజున రాజదర్బార్ ఏర్పాటు చేసే సంప్రదాయం మూడో కృష్ణ రాజా వడయార్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఆచారం గా మారిపోయింది . మైసూరు దసరా అంటే అట్టాహాసం గా జరిగే రాజప్రాకారపు ఊరేగింపులు మాత్రమే కాదు – అవి మన సంస్కృతి , సంప్రదాయాలు, సాహిత్యం, ఇతిహాసాలు, కళలు, కలలు – అన్నీ కలబోసిన ఒక సంబరం – ఒక జాతి సాంస్కృతిక సంపద- అవ్వన్నీ కలగలిపి వీక్షించడం అనేది ఒక మధురమైన అనుభూతి – చూసేవాళ్లకు కన్నుల పండుగ.
మైసూర్ మహారాజులు తమ ఇంటి దేవత గా చాముండి దేవి ని పూజిస్తారు, ఆరాధిస్తారు .
దసరా ముందు తొమ్మిది రోజుల పాటు శక్తీ మాతకు పూజలు చేస్తారు. దసరా రోజున మైసూరు మహారాజ ప్యాలస్ లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానం గా ప్రకాశిస్తుంటుంది . మైసూరు మహారాజులు నివసించు ప్యాలస్ లోనే ఈ ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులన్నీ భద్రపరుస్తారు . మహారాజ ప్యాలస్ లో ఉండే అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని , దసరా వేడుకలకి పది రోజులు పాటు ప్రజలకు దర్శించే అవకాశం కల్పిస్తారు .
మైసూరు దసరా ఉత్సవాలను తిలకించడానికి ప్రపంచ వ్యాప్తం గా పర్యాటకులు మైసూరు వస్తారు . శ్రీ చాముండి అమ్మవారిని , దసరా నవరాత్రుల సందర్భం గా తొమ్మిది అవతారాలలో ప్రత్యేకముగ అలంకరించి పూజలు చేస్తారు . మైసూరు మహారాజులు తమ కులదైవమైన చాముండేశ్వరి దేవిని అలంకరించి, ఆరాధించి, ఏనుగులమీద ఊరేంగించడం అనేది ఇక్కడ ఆచారం. ఆ సమయం లో మైసూరు మహారాజ ప్యాలస్ ప్రత్యేకమైన అలంకరణలతో వెలిగిపోతుంటుంది. రాజు గారి ఆయుధ పూజ, ఏనుగుల అలంకరణ , నవరాత్రుల్లో , తొమ్మిదో రోజున మైసూరు రాజవంశానికి చెందిన రాజ ఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేయడం ఆకట్టుకుంటుంది .
వందల ఏళ్ల క్రితం మైసూరు రాజ కుటుంబం ప్రారంభించిన ఈ వేడుకలు – ఇప్పటికీ ఆంతే ఉత్సాహం తో , ఆంతే భక్తి శ్రద్ధలతో , ప్రతి సంవత్సరం వైభవోపేతంగా జరుగుతున్నాయి. మొత్తం గా ఈ పదిరోజుల పండుగ ను వీక్షిస్తానికి ప్రపంచం వ్యాప్తం గా లక్షలాది మంది పర్యాటకులు మైసూరు సందర్శిస్తారు . నెలరోజుల ముందే మైసూరు పట్టణం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది . పర్యాటకులు ఈ దాసరా రోజుల్లో మైసూరు ప్రాంత సందర్శన ఒక మధుర జ్ఞాపకం గా మిగులుతుంది- ప్రతి పర్యటకుడికి భూతల స్వర్గం లో ఉన్న అనుభూతి కలుగుతుందన్న మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు . – సత్య కేశరాజు