Sunday, September 8, 2024

ఖమ్మం ఎంపీ కోసం నేతలు క్యూ

- Advertisement -

ఖమ్మం ఎంపీ కోసం నేతలు క్యూ
ఖమ్మం, జనవరి 8,
ఖమ్మం ఎంపీ టికెట్ హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరు.? అనే అంశంపై రాజకీయ పెద్దల నుంచి సాధారణ పౌరుల వరకు చర్చనీయాంశమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లా రాజకీయంగా ఎప్పుడూ వైవిధ్యతను కలిగి ఉంటుంది. మిక్స్డ్ కల్చర్ గా కనిపించే ఖమ్మం జిల్లా రాజకీయాలు రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసి గత అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. తాజాగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి గెలుపు ముందే నిశ్చయమైనట్లు చర్చ జరుగుతోంది. ఫలితంగా రోజుకో కొత్త ముఖం తెరపైకొస్తోంది. ఈ క్రమంలో అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేదానిపైనే ఉత్కంఠత నెలకొంది.ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఆశావాహ అభ్యర్థుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. కాగా మొన్నటి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి మంత్రి పదవులు పొందిన అతిరథులు సైతం ఎంపీ టికెట్ ను తమ వారికి ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన భట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని పొందారు. అలాగే మరో ఇద్దరు దిగ్గజాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలకమైన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖలు దక్కగా, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా కొలువుదీరారు. అయితే ఈ ముగ్గురు నేతలు సైతం తమ అనుయాయులను ఎంపీ అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారన్న వార్తలు ఇటీవల హల్చల్ చేశాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో, కొన్ని దిన పత్రికల్లో సైతం తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ ఖమ్మం ఎంపీగా పోటీ పడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు పలు పత్రికలు కథనాలను ప్రచురించాయి.గడిచిన రెండు, మూడు పర్యాయాల నుంచి ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారీ ఆ వ్యాపారవేత్త పేరు తెరపైకి వస్తుంది. ఎన్నికలు ముగిశాక ఆ పేరు ఎక్కడా వినిపించదు. ఈసారి కూడా ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. ఖమ్మం ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఖమ్మం పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనతో కలిసి సదరు వ్యాపారవేత్త హెలికాప్టర్ లో దిగడం రాజకీయ చర్చకు దారి తీసింది. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సాన్నిహిత్యం కొనసాగించిన ఆ వ్యాపారవేత్త మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వెనువెంటనే తన ప్లేట్ మార్చివేశారు. ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ మంత్రులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైనం చర్చకు కారణమైంది.కాంగ్రెస్ తరపున పోటీ పడేందుకు కొత్త ముఖాలు తెరపైకి వస్తుండగా ఇక్కడ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి పదవిని సైతం అలంకరించిన మాజీ మంత్రి రేణుకా చౌదరి పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జరుగుతుంది. ఖమ్మం ఆడపడుచుగా చెప్పుకునే రేణుకా చౌదరి చాలా ఏళ్లుగా ఖమ్మం కేంద్రంగా రాజకీయాలు నెరిపారు. తాజాగా ఆమె సైతం మరోసారి ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతుంది. 2019 ఎన్నికల్లో రేణుక ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు చేతిలో పరాజయం పొందారు. ఈసారి రాష్ట్రం అంతటా కాంగ్రెస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ఖమ్మం టికెట్ కోసం అధిష్టానం వద్ద గట్టి పట్టు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇలా మాజీ మంత్రి రేణుక తో పాటు తాజా మంత్రుల అనుయాయులు, వ్యాపారవేత్తలు సైతం ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీపడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతటి పోటీ నేపథ్యంలో అసలు అధిష్టానం మదిలో ఎవరు ఉన్నారన్నదే వేచి చూడాల్సిన అంశంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్