పల్లె ప్రగతి రాష్ట్ర పరిశీలకురాలు దేవసేన
జగిత్యాల
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన అభయ హస్తం, ఆరు గ్యారంటి పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని పల్లె ప్రగతి రాష్ట్ర పరిశీలకురాలు దేవసేన అన్నారు.
శుక్రవారం రోజున మల్యాల మండలంలోని గొల్లపల్లి, జగిత్యాల గ్రామీణ మండలంలోని వోడ్దేరా కాలనీ గ్రామాలలో జరిగిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం, గ్యారంటి పథకాలలో అర్హులైన పేద ప్రజలు అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత దరఖాస్తులలోని అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పూరించి కౌంటర్లలో అందజేసి రశీదు పొందాలని సూచించారు. అట్టి రశీదులను భద్రపరుచుకోవాలని, రానున్న కాలంలో పథకాలను మంజూరు చేసే అవసర సమయంలో చూపించవలసి ఉంటుందని సూచన ప్రాయంగా తెలిపారు. దరఖాస్తు దారులతో ముచ్చటిస్తూ వారు దేనికి ధరఖాస్తు చేసుకుంటున్నారు, పూర్తీ సమాచారాన్ని రాశారా లేదా అని విషయాన్నీ తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఆర్దీవో నరసింహ మూర్తి, జిల్లా పంచాయతి అధికారి దేవ రాజ్, స్థానిక మండల, గ్రామ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.