యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ను ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. ‘డీజే టిల్లు’, ‘మ్యాడ్’, ‘జెర్సీ’, ‘టిల్లు స్క్వేర్’ వంటి అద్భుతమైన చిత్రాలను దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023 అక్టోబరులో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని రూపొందిస్తున్నారు.
‘మ్యాడ్’తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘టిల్ స్క్వేర్’కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’తో రాబోతున్నారు.
‘మ్యాడ్’లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
‘మ్యాడ్ నెస్’ ఇంకా పూర్తి కాలేదు అని తెలిపిన మేకర్స్.. ఈసారి ‘మ్యాడ్ నెస్’ రెట్టింపు ఉంటుందని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే, ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి.. థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది.
ఇటీవల ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.. ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె మరియు ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గతంలో వారి చేతుల మీదుగా ప్రారంభమైన ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ‘మ్యాడ్’ చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగి, ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
‘మ్యాడ్’ కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంపై నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సీక్వెల్‌తో ప్రేక్షకులకు థియేటర్లలో మ్యాడ్ మ్యాక్స్ వినోదాన్ని అందిస్తామని వాగ్దానం చేస్తున్నారు.