మామునూరు ఎయిర్ పోర్ట్..
ప్రభుత్వానికి టెన్షన్..
వరంగల్, మార్చి 7, (వాయిస్ టుడే )
Mamunur Airport..
Tension for the government..
మామునూరు ఎయిర్ పోర్ట్ చరిత్ర ఇప్పటిది కాదు. భారత స్వాతంత్ర్యానికి పూర్వమే అంటే నిజాం రాజుల పాలనలో 1930లో దీన్ని నిర్మించారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని జాతికి అంకితం చేశారు. ఇది షోలాపూర్ లో వ్యాపార అభివృద్ధికి, సిర్పూర్ కాగజ్ నగర్ లో కాగితపు పరిశ్రమ సౌకర్యార్ధం వరంగల్ లో అజాంజాహి మిల్స్ సేవల కోసం ఈ ఎయిర్ పోర్ట్ ఉపయోగపడేది.స్వాతంత్ర్యం తర్వాత పలువురు ప్రధాన మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఇండో చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టును శత్రువులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ప్రయాణికులకు మామునూరు ఎయిర్ పోర్ట్ సేవలు అందించింది. 1875 ఎకరాల స్థలంలో 6.6 కిలోమీటర్ల రన్ వే, పైలెట్ సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, ఒకటికన్నా ఎక్కువ టెర్మినళ్లతో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఉండేది. కాలక్రమేణ ప్రభుత్వాల నిర్లక్ష్యం, అప్పటి ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనంతో దీన్ని 1981లో మూసివేశారు.తాజాగా రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష మళ్లీ తెరపైకి వచ్చింది. జీఎంఆర్ అభ్యంతరాలను పరిశీలించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ సంస్థను చివరికి ఒప్పించాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ కూడా సమ్మతించడంతో మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎయిర్ పోర్టుకు మోక్షం కలిగినప్పటికీ.. భూసేకరణ అంశం మాత్రం తెలంగాణ సర్కార్ కు సవాల్ గా మారింది. ఒకప్పుడు వరంగల్ నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న మామునూరు ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో ప్రస్తుతం బహుల అంతస్తుల నిర్మాణాలు, లేఔట్లు వెలిశాయి.రైతుల నుంచి సర్కార్ భూములను సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామ సభలు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖతో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గ్రామ సభల్లో పాల్గొన్నారు. భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని, ఎవరినీ రోడ్డున పడనివ్వబోమని నిర్వాసితులకు మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. దీంతో మంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాకే భూసేకరణ చేయాలని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో సమస్య జఠిలమైంది.