మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు’
Manmohan brought economic reforms with vision'
న్యూఢిల్లీ, డిసెంబర్ 27
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయన మృతితో దేశం ఓ గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మన్మోహన్ మరణం బాధాకరమని.. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని.. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి.. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
అటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం మన్మోహన్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. బెళగావి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి మన్మోహన్ నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు ఎంపీలు, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
మన్మోహన్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు
అటు, మన్మోహన్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించనున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని.. ఆయనతో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకూ మన్మోహన్ అందించిన సహకారం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సమయంలో ప్రతీ సందర్భంలోనూ మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో ఆయన అందించిన సహకారం మరువలేనిది. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌కు బీఆర్ఎస్ తరఫున ఘన నివాళులు.’ అని కేసీఆర్ పేర్కొన్నారు.