Monday, January 6, 2025

అర్థం కానీ రేవంత్ వ్యూహం….

- Advertisement -

అర్థం కానీ రేవంత్ వ్యూహం….
మంత్రి వర్గంలో ఖాళీలు లేవంటూ కామెంట్
హైదరాబాద్, జూన్ 28,
తెలంగాణ మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేవలం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అంతే కాదు పదేళ్లుగా పార్టీ కోసం పోరాడి ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం ఆరాటంగా ఎదరు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ పార్టీ అధినాయకత్వం లోక్ సభ ఎన్నికల డెడ్ లైన్ పెట్టింది.  మంచి ఫలితాలు సాధిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఆశ కల్పించారు. దీంతో  అందరూ శ్రమపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే  అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న  సామల కిరణ్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినా దగ్గరుండి గెలిపించుకుని వచ్చారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు. ఇలాంటి ఆశావహులంతా ఆశగా ఎదురు చూస్తున్న వేళ  రేవంత్  రెడ్డి ఢిల్లీలో అసలు విషయం చల్లగా చెప్పారు. అసలు మంత్రివర్గంలో ఖాళీలు లేవని తేల్చేశారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నదానిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే  విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో మొత్తం  శాసనసభ్యుల సంఖ్య 119. ఇందులో పదిహేను శాతం మందికి మాత్రమే మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉంది. అంటే ముఖ్యమంత్రి సహా పద్దెనిమిది మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మరో పదకొండు మంది ప్రమాణం చేశారు. అంటే పన్నెండు మంది ప్రమాణం చేశారు. మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. సామాజికవర్గాల ప్రకారం చూస్తే పన్నెండు మందిలో ముఖ్యమంత్రితో సహా నలుగురు రెడ్లకు చోటు లభించింది. మంత్రులుగా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పదవులు పొందారు.  ఎస్సీల్లో మాల సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ పదవి లభించింది. మరో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహాకు మంత్రి లభించింది. ఎస్టీల్లో ఆదివాసీ వర్గం నుంచి సీనియర్ అయిన ధనసరి అనసూయ ఆలియాస్ సీతక్కకు కేబినెట్‌లో చోటు లభించింది. బీసీల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌, పద్మశాలి వర్గానికి చెందిన కొండా సురేఖకు చోటు దక్కింది. బ్రాహ్మాణ సామాజికవర్గం నుంచి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు.  మంత్రివర్గంలో ఆరుగురు ఓసీలు ఉంటే…బీసీలు ఇద్దరు, ఎస్సీలు ఇద్దరు, గిరిజనులు ఒకరు ఉన్నారు.  మంత్రి పదవులు ప్రతి జిల్లాకు ఉండేలా చూసుకుంటారు. తెలంగాణలో జిల్లాలు ఎక్కువ కాబట్టి ఉమ్మడి జిల్లాలకు అయినా కనీసం ఒక్కరైనా మంత్రి పదవి ఉండేల చూసుకుంటారు.కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి సమన్యాయం చేయలేకపోయారు.  ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నేతలకు కేబినెట్‌లో చోటు లభించలేదు. ఈ జిల్లాల నుంచి పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ…సామాజిక సమీకరణాల భాగంగా పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సీనియర్ నేతలు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకట్‌స్వామి, మాజీ మంత్రి గడ్డం వినోద్, ప్రేమ్‌సాగర్‌రావు కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నారు.  ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్‌ నుంచి గెలుపొందిన సుదర్శన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీనియర్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి…కేబినెట్‌లో అవకాశం లభిస్తుందని ఆశించారు.  వీరికి కూడా అమాత్య పదవి దక్కలేదు. హైదరాబాద్‌లో ఒక్కరు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలుపొందలేదు. దీంతో పార్టీలో చేరిన దానం నాగేందర్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో  ఖమ్మం జిల్లాకు మూడు, కరీంనగర్, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు రెండేసి పదవులు దక్కాయి.  మంత్రి పదవుల కోసం రేవంత్ రెడ్డితో పాటు హైకమాండ్ పైనా తీవ్ర ఒత్తిడి ఉంది.  కనీసం నాలుగైదు స్థానాలను భర్తీ  చేసి ఒక్క దాన్ని ఖాళీగా ఉంచాలనుకున్నారు. ఈ మేరకు జాబితా సిద్ధం చేసి కాంగ్రెస్ వద్దకు రేవంత్ రెడ్డి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా చేర్చుకున్న వారిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారని భావిస్తున్నారు. అయితే హైకమాండ్ దీనికి అంగీకరించలేదని తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి పదవుల విషయంలో తమ సిఫారసులు చూడాలని భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్లు కూడా కొన్ని పేర్లను హైకమాండ్ కు ఇచ్చారు. ఆ పేర్లు.. రేవంత్ రెడ్డి ఇచ్చిన పేర్లు వేర్వేరు. వాటిలో పేర్లను ఖరారు చేస్తే  వర్గ పోరాటం మరింత పెరుగుతుందన్న ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయానికి రావాలని ముఖ్యమంత్రితో పాటు ఇతర నేతలకు సహాలిచ్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవడమే కాదు.. వారికి మంత్రి పదవులు కూడా ఇస్తే పార్టీలో తిరుగుబాటు వస్తుందని.. పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ సహజంగానే వినిపిస్తోంది. అదే సమయంలో భర్తీచేయాల్సిన పదవులు ఆరే ఉన్నాయి. కానీ ఆశించేవారు అంత కంటే ఎక్కువ ఉన్నారు. ఎవరికి ఇచ్చి ఎవరికి ఇవ్వకపోయినా మిగిలిన వాళ్లు అసంతృప్తికి గురవుతారు. మామూలుగా అయితే పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇచ్చి.. సామాజిక సమీకరణాలు కుదరని వారికి ఎలాగోలా సర్ది చెప్పుకుని రేవంత్ బయటపడేవారు. కానీ బీఆర్ఎస్‌ను బలహీనం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని చేర్చుకుంటూండటంతో కొత్త తలనొప్పులు వస్తున్నాయి. హైదరాబాద్ కు మంత్రి ఉండాలంటే.. ఇప్పుడు దానం నాగేందర్ తో ప్రమాణం చేయించాలి. ఎంపీగా ఓడిపోతే ఆయనకు పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్న ప్రచారం ముందు నుంచీ జరుగుతోంది. ఆయనకు పదవి ఇస్తే ఇతర కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతారు. అలాగే మరికొంత మందినేతల చేరికపైనా పార్టీలో అసంతృప్తి ఉంది. అన్నీ కలిపి రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా మారుతూండంతోనే ఆయన మంత్రివర్గ విస్తరణ విషయాన్ని తాత్కలికంగా పక్కకు పెట్టేశారని అంటున్నారు. అయితే.. ఈ పదవుల కోసం ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. రేవంత్  పరిష్కరించుకోలేని సమస్యగా దీన్ని పక్కన పెట్టేస్తే అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్