మీనాక్షి మార్క్ పాలిటిక్స్…
హైదరాబాద్, మార్చి 3, (వాయిస్ టుడే )
Meenakshi Mark Politics...
అవును.. తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ అవసరం. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు నేతలు గాడి తప్పుతూనే ఉంటారు. పార్టీ లైన్ ను థిక్కరించడం కేవలం పదవుల కోసమో.. లేక తమ ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి కొందరు నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఒకరికి ఒక పదవి సరిపోదు. దానికి మించి కావాలి. ఇంట్లో ఒక పదవి వచ్చినా మరొక పదవి కోసం మాటలు పెదవులు దాటుతుంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అది సాధ్యం కాదు. పార్టీ అధినేతలు శాసించిన మేరకే జరుగుతుంది. జాతీయపార్టీ అయిన బీజేపీలోనూ ఇలాంటి అవలక్షణాలు మనకు కనపనడవు. కేవలం కాంగ్రెస్ లోనే కనపడతాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలను పదవులకు దూరం పెట్టినా, మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకపోయినా కిక్కురు మనలేదు. అంతెందుకు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచింది. ఆయనను కలవాలన్నా మంత్రులకే సాధ్యం కాదు. ఆయనకు నచ్చి ఇచ్చిన వారికే టిక్కెట్లు.. మెచ్చిన వారికే పదవులు. ఇలా ఉంటది రీజనల్ పార్టీలతోని. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు భిన్నమైనది. ఎవరు ఎఫ్పుడు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. బహిరంగ ప్రదేశాల్లో వారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాంగ్రెస్ లో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. అధిష్టానం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యమై పోయింది.ఇక రోజులు మారాయి. రాహుల్ గాంధీ కాలం వచ్చేసింది. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన వారిని ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ పార్టీ నేతలకు పంపారు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన తీన్మార్ మల్లన్న తర్వాత పార్టీని ఇబ్బందులు పెట్టేలా వ్యవహరించారు. పార్టీని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎవరినీ వదలకుండా దుమ్ము దులిపేశాడు. కానీ బీసీ నేత అని కాంగ్రెస్ హైకమాండ్ స్పేర్ చేయలేదు. పార్టీ బలోపేతంగా ఉండాలంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకైనా మొత్తం ఆ సమాజికవర్గం వెనక రాదు. అలాగే గంపగుత్తగా ఓట్లు వెళ్లిపోవు. ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించే ఏ సామాజికవర్గమైనా ఆలోచించి ఓట్లు వేస్తుంది. అది తెలియకుండా నేతలు వ్యవహరిస్తే చర్యలు ఇలాగే ఉంటాయని హస్తం పార్టీ చెప్పకనే చెప్పినట్లయింది.