మహబూబ్ నగర్ : బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై అభిమానులు, ప్రజలు ఒక్కోరకంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మేదరి సంఘం సభ్యులు మాత్రం రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ ఖర్చులకోసం అయ్యే డబ్బులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తులాభారం ద్వారా అందించారు.జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో మేదరి సంఘం ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రిని భారీ క్రేన్ ద్వారా పూలమాలతో స్వాగతం పలికి మంత్రి నిలువెత్తు బరువున్న రూపాయి నాణేలతో ఆయనకు తులాభారం వేశారు. ఈ డబ్బులను రాబోయే ఎన్నికల్లో నామినేషన్ ఖర్చులకోసం వినియోగించుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.ఊహించని రీతిలో తనపై ఇంతటి అభిమానం ప్రదర్శించడం ఎప్పటికీ మర్చిపోలేనని మంత్రి అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించాలని ప్రజలు తమ ఆదరాభిమానాలను ఈ విధంగా ప్రదర్శించడం ఎంతో ఉత్సాహాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
