యువతకు పెద్దపిట వేస్తున్న ప్రభుత్వం – ఎమ్మెల్యే గండ్ర
MLA Gandra is a government that is giving a thumbs up to the youthజయశంకర్ భూపాలపల్లి,
రాష్ట్ర ప్రభుత్వం యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. యువ వికాసం కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి బుధవారం ఐడిఓసి కార్యాలయంలో గ్రూప్-4కు ఎంపికైన అభ్యర్థులకు పెద్దపల్లి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. మన జిల్లా నుండి ఎంపికైన 101 మంది గ్రూప్ 4 అభ్యర్థులను పెద్దపల్లిలో నియామకపు పత్రాలు తీసుకోవడానికి వెళ్లేందుకు మూడు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరకాలంలో ఇప్పటివరకు 53 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వివరించారు. 10 వేలు ఉపాద్యాయ పోస్టులు, 7,900 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీచేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు
భర్తీకి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా లక్ష యాభై వేల పోస్టులను భర్తీచేయనున్నట్లు వెల్లడించారు. విద్యా, వైద్యం కీలకమని భావించిన ప్రభుత్వం ఈ రెండు రంగాలను రెండు కళ్లుగా భావించి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో పాఠ్య, నోటు పుస్తకాలు, ఏక రూప దుస్తులు అందచేసామని తెలిపారు. అదేవిధంగా, వసతిగృహాలలో ఉన్న విద్యార్థులకు 40% డైట్ చార్జీలను పెంచామని అన్నారు. రైతులకు మేలు చేసేందుకు 23 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వమని స్పష్టం తెలిపారు.
ఈ సందర్భంగా గ్రూప్ 4 ఎంపికైన అభ్యర్థులు విధుల నిర్వహణలో అంకితభావంతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ల అశోక్ కుమార్, విజయలక్ష్మి, నోడల్ అధికారి అవినాష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.




