ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదు
కవిత లిక్కర్ స్కాంలో ప్రజల సొమ్మును దొచుకోలేదా!
కవిత బీజేపీ కేంద్ర అగ్రనేతల కాళ్లు మొక్కి ఆ కేసు నుంచి తప్పించుకోలేదా!
నిలదీసిన మంత్రి కొండా సురేఖ
వరంగల్ ఫిబ్రవరి 3
: ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు లేదని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ… భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఆ సొమ్ము కేసీఆర్ సొంత డబ్బులు కాదని.. ప్రజల సొమ్ము అని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ నేతలు ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకు తిన్నారని ధ్వజమెత్తారు. కవిత లిక్కర్ స్కాంలో ప్రజల సొమ్మును దొచుకోలేదా అని ప్రశ్నించారు. కవిత బీజేపీ కేంద్ర అగ్రనేతల కాళ్లు మొక్కి ఆ కేసు నుంచి తప్పించుకోలేదా అని నిలదీశారు. కవిత ఎక్కడ నుంచైనా ఎంపీగా పోటీ చేయొచ్చని.. ఆమెను తెలంగాణ ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపుతారని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.
చిల్లర విమర్శలు మానుకోవాలి
కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, బీఆర్ఎస్ నేతలకు అసలే కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చిల్లర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కవిత మహాత్మ జ్యోతిరావుపూలే గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బతుకమ్మ, జాగృతి పేరుతో ప్రజల్లో ఉండాలని కవిత చూస్తున్నారని.. ఆమె పప్పులు ఇక ఉడకవని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.
ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదు
- Advertisement -
- Advertisement -