8.3 C
New York
Friday, April 19, 2024

మోడీ సర్కారు మాయ !

- Advertisement -

** మోడీ సర్కారు మాయ !
Mar 1,2024

ఎన్నికల వేళ జిడిపికి రెక్కలు
మూడవ త్రైమాసికంలో 8.4 శాతం పెరిగినట్టు ప్రకటన
ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్నికల వేళ మరో మాయాజాలానికి పాల్పడింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోవడంతో పాటు పెరుగుతున్న ధరలతో విలవిలలాడుతున్న సామాన్యుడి ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించేలా, దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నట్లు చూపుతోంది, దీనిలో భాగంగా క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా కాగితాలపై వృద్ధి లెక్కలను భారీగా పెంచివేసింది. ఒక్కసారి ఇంత వృద్ధి ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలకు తావు లేకుండా చూసేందుకు గడిచిన ఆరు నెలల కాలపు వృద్ధి లెక్కలను కూడా పెంచుతూ సవరించింది. అనూహ్యంగా వెలువడిన ఈ గణాంకాల పట్ల దేశ వ్యాప్తంగా ఆర్థికరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌బిఐతో పాటు, వివిధ రంగాల నిపుణులు వేసిన అంచనాలకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వృద్ధికి పొంతన లేకపోవడమే వారి ఆశ్చర్యానికి కారణం. కృత్రిమ వృద్ధి లెక్కలు దేశానికి భవిష్యత్తులో తీవ్ర హాని చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. అయితే, బిజెపి నాయకులు, వారి మద్ధతు దారులు మాత్రం భారీ వృద్ది పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిడిపి ఎంత…?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు (2023-24) తృతీయ త్రైమాసికం ( అక్టోబర్‌-డిసెంబర్‌)లో జిడిపి 8.4 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసు (ఎన్ఎస్ఒ) గురువారం సాయంత్రం నివేదికను విడుదల చేసింది. అదే సమయంలో మొదటి, రెండవ త్రైమాసికపు గణాంకాల లెక్కలను కూడా సవరించింది. మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) లో 7.8శాతం జిడిపి నమోదైనట్లుగా గతంలో ప్రకటించగా తాజాగా దానిని 8.2శాతంగా సవరించింది. రెండవ త్రైమాసికం (జులై- సెప్టెంబర్‌)లో 7.6 శాతంగా ఉన్న వృద్ధిని 8.1 శాతంగా పెంచింది. వీటి కొనసాగింపుగా తృతీయ త్రైమాసికంలో 8.4శాతానికి చేరినట్లు పేర్కొంది. ఈ కాలంలో తయారీ, మైనింగ్‌, నిర్మాణాలు పుంజుకోవడంతో ఈ వృద్ధి సాధ్యమైందని ఈ నివేదిక పేర్కొంది. 2011-12 స్థిర ధరలతో పోల్చితే గడిచిన డిసెంబర్‌ త్రైమాసికంలో జిడిపి విలువ రూ.43.72 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23 ఇదే త్రైమాసికంలో 4.5 శాతంగా వృద్ది రేటు (రూ40.35 లక్షల కోట్లు)గా ఉంది. దాంతో పోలిస్తే తాజా నిర్ధారణ 8.4 శాతం చాలా ఎక్కువ కావడం గమనార్హం ఈ లెక్కల కోసం నిర్మాణ రంగం ఏకంగా 10.7 శాతం, తయారీ రంగం 8.5 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం చూపింది.

ఇవీ అనుమానాలు

రేరటింగ్‌ ఎజెన్సీలతో పాటు దిగ్గజ ఆర్థిక సంస్థల పరిశోధన సంస్థల అంచనాను మించి జిడిపి పెరుగుదల చోటు చేసుకోవడంతో ఎన్నికల మాయాజాలమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్‌బిఐ వేసిన అంచనాల ప్రకారం మూడవ త్రైమాసికంలో 6.5శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఎస్‌బిఐ రిసెర్చి గ్రూపు 6.7 -6.9 మధ్య వృద్దిని అంచనా వేసింది. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చి సంస్థ 6.5శాతానికే వృద్ధి పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎకనామిక్‌ టైమ్స్‌ 15 మంది నిపుణులతో నిర్వహించిన పోల్‌ 6నుండి 7.2 శాతం మధ్య వృద్ధి వుండే అవకాశం ఉందని అంచనా వేసింది. 17 మంది ఆర్థికవేత్తల అభిప్రాయాలను ఆధారంచేసుకుని 6.64 శాతం కు వృద్ధి పరిమితమయ్యే అవకాశం ఉందని మింట్‌ పేర్కొంది. అన్ని సంస్థలు గత త్రైమాసానికన్నా తక్కువ వృద్ధినే అంచనా వేయగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం భారీగా పెరిగిందని పేర్కొనడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో గొప్ప సానుకూలాంశాలు లేవని, పెట్టుబడులు పెద్దగా పెరగలేదని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న తయారీ, నిర్మాణ రంగంలో కూడా భారీ వృద్ధి లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు పెరుగుతున్న డిమాండే దీనికి నిదర్శనమని వారు వివరిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!