జత కలిసిన బీఆర్ఎస్
న్యూఢిల్లీ, జూలై 26, (వాయిస్ టుడే): మణిపూర్ హింసాకాండపై భగ్గుమన్న విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టాయి. INDIA గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి పూర్తి స్థాయిలో దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, BRS ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని అందజేశారు. లోక్‌సభలోని కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పోరాడడానికి చివరి అస్త్రం ఇదే అని తేల్చి చెప్పారు. ఈ అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. దీనిపై మాణికం ఠాగూర్ స్పందించారు. INDIA కూటమి ఈ విషయంలో కలిసి పోరాడుతుందని తేల్చి చెప్పారు.
“INDIA కూటమి కలిసే ఉంటుంది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అంతా కలిసే నిర్ణయించుకున్నాం. ప్రధాని మోదీ గర్వాన్ని అణిచివేయాలన్నదే మా ఉద్దేశం. ఆయన వైఖరి అసలు బాగోలేదు. పార్లమెంట్‌కి రావడం లేదు. మణిపూర్‌పై ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. అందుకే…దీన్నే మా చివరి ఆయుధంగా మార్చుకున్నాం”
– మాణికం ఠాగూర్, కాంగ్రెస్ ఎంపీ
అటు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా దీనిపై స్పందించారు. ప్రధాని మోదీ మణిపూర్ హింసపై మాట్లాడితే దేశమంతా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. “మా పార్టీ తరపున ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రధాని మోదీ దీనిపై మాట్లాడి ఉంటే కొంత వరకైనా అలజడి తగ్గుతుంది. అందుకే…ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం”
– నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీ
ఈ అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ స్పందించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కేంద్రం చర్చించేందుకు సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. “అవిశ్వాస తీర్మానం వస్తే రానివ్వండి. కేంద్రం అన్ని పరిస్థితులకూ సిద్ధంగానే ఉంది. సమావేశాలు ముగిసిపోకముందే సజావుగా మణిపూర్ హింసపై చర్చ జరగాలని మేమూ కోరుకుంటున్నాం. అందుకు మేం ఒప్పుకుంటున్నా కూడా వాళ్లు రూల్స్ గురించి గొడవ చేస్తున్నారు. ప్రధాని మోదీ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కేవలం సభ సజావుగా సాగనీయకుండా చూసే సాకులు మాత్రమే”