
న్యూఢిల్లీ, జూలై 26, (వాయిస్ టుడే): ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు పార్లమెంట్ ఆవరణలో వింత అనుభవం ఎదురైంది. బయట నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా పదేపదే ఓ కాకి వచ్చి ఆయనపై దాడి చేసింది. కాలిగోళ్లతో రాఘవ్ చద్దా తలపై రక్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకి వచ్చిన ప్రతిసారీ ఆయన తల వంచి అలాగే ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సరదా సంఘటన కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఢిల్లీ బీజేపీ ఈ ఫొటోలను ట్వీట్ చేసి…రాఘవ్ చద్దాపై సెటైర్లు వేసింది. “అబద్ధాలు చెబితే కాకి పొడుస్తుందనే సామెతను ఇప్పటి వరకూ విన్నాం. ఇప్పుడది నిజమైంది” అని ట్వీట్ చేసింది. బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా దీన్ని రీట్వీట్ చేసి మరోసారి సెటైర్ వేశారు. “ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసిందన్న వార్త విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది. మీ ఆరోగ్యం బాగానే ఉందని అనుకుంటున్నాం” అని ట్వీట్ చేశారు. మణిపూర్ హింసాకాండపై భగ్గుమన్న విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టాయి. INDIA గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి పూర్తి స్థాయిలో దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, BRS ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని అందజేశారు.లోక్‌సభలోని కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పోరాడడానికి చివరి అస్త్రం ఇదే అని తేల్చి చెప్పారు. ఈ అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ స్పందించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కేంద్రం చర్చించేందుకు సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. “అవిశ్వాస తీర్మానం వస్తే రానివ్వండి. కేంద్రం అన్ని పరిస్థితులకూ సిద్ధంగానే ఉంది. సమావేశాలు ముగిసిపోకముందే సజావుగా మణిపూర్ హింసపై చర్చ జరగాలని మేమూ కోరుకుంటున్నాం. అందుకు మేం ఒప్పుకుంటున్నా కూడా వాళ్లు రూల్స్ గురించి గొడవ చేస్తున్నారు. ప్రధాని మోదీ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కేవలం సభ సజావుగా సాగనీయకుండా చూసే సాకులు మాత్రమే”
– అర్జున్ రామ్ మేఘ్‌వాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి