-
Munnurukapu Plenary on 27th.. Open house also soon మున్నూరుకాపు కార్పోరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవాలని
అపెక్స్ కౌన్సిల్ తీర్మానం - ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయం
- ఈనెల 27న ప్లీనరీ ఏర్పాటు
- వచ్చే నెలలో హైదరాబాద్ లో బహిరంగ సభ
- ఎంపీ రవిచంద్ర నివాసంలో మంగళవారం రాత్రి 5గంటల పాటు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
మున్నూరుకాపుల సంక్షేమం,ఉన్నతికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును త్వరలో కలిసి కోరుదామని రాజ్యసభ సభ్యులు,అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్, మున్నూరుకాపు సంఘం గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. కార్పోరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి గతంలో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి తాను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ విషయమై మన మున్నూరుకాపు ప్రముఖులైన రాజ్యసభ సభ్యులు కేశవరావు, మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త్వరలో కేసీఆర్ ను కలిసి కార్పోరేషన్ ఏర్పాటు గురించి విజ్ఞప్తి చేద్దామన్నారు.బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో ఆయన అధ్యక్షతన సుమారు 5గంటల పాటు కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ మెంబర్స్, మున్నూరుకాపు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ, సంఘం పటిష్టతకు మనమందరం చిత్తశుద్ధితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఇందుకోసం కౌన్సిల్ సమావేశాన్ని ప్రతి 15రోజులకొకసారి జరుపుకుందామని, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సదస్సులు నిర్వహించుకుందామన్నారు.

అలాగే, ఈనెల 27న హైదరాబాద్ లో విస్త్రత స్థాయి (ప్లీనరీ)సమావేశం ఏర్పాటు చేసుకుందామని, దీనికి మన కులానికి చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, సంఘం రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలు,అసెంబ్లీ నియోజకవర్గాల, వివిధ విభాగాల బాధ్యులు, న్యాయవాదులు, డాక్టర్లు, జర్నలిస్టులు తదితర ప్రముఖులను ఆహ్వానిద్దామని రవిచంద్ర తెలిపారు.సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య మాట్లాడుతూ,1,000కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటును వెంటనే ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉందన్నారు.కౌన్సిల్ కన్వీనర్ సుంకరి బాలకిషన్ రావు మాట్లాడుతూ,ఓకే కులం-ఓకే సంఘం నినాదంతో మనమందరం ఒక తాటిపైకి వచ్చి లోకానికి మన ఐక్యతను చాటి చెప్పామన్నారు.కౌన్సిల్ సభ్యులు రౌతు కనకయ్య మాట్లాడుతూ, మనం సమాజంలోని ఇతర వర్గాలతో కూడా సఖ్యతతో ఉండి రాజకీయంగా చురుకుగా ముందుకు సాగాలన్నారు.కౌన్సిల్ సభ్యులు సీ.విఠల్ మాట్లాడుతూ,ఇది మన కులానికి సంబంధించిన అత్యున్నత నిర్ణాయక సంఘం అని, దీనిని జేఏసీగా కూడా పిలుచుకోవచ్చని,ఇందులో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను సంఘం, సంఘంలోని ఆ యా విభాగాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
పార్టీలకు అతీతంగా మనమందరం మరింత ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని మున్నూరుకాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు అన్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ మాట్లాడుతూ,మనమంతా మరింత ఐక్యమత్యంగా ముందుకు సాగేందుకు గాను వచ్చేనెలలో భారీ బహిరంగ సభ, దానికి ముందు సన్నాహాక సమావేశం (ప్లీనరీ) ఏర్పాటు చేసుకుందామన్నారు.కోకాపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ నాగేందర్ చెప్పారు.రోడ్లు,భవనాల సంస్థ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్పోరేషన్ ఏర్పాటు గురించి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేద్దామన్నారు.కౌన్సిల్ సభ్యులు సర్థార్ పుటం పురుషోత్తం రావు మాట్లాడుతూ, కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు సంఘం పటిష్టతకు, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవలసిన అవసరం ఉందన్నారు.కౌన్సిల్ కన్వీనర్ గా మున్నూరుకాపులకు చాలా కాలం పాటు విశేష సేవలందించిన సుంకరి బాలకిషన్ రావు తన ఆరోగ్యం సహకరించనందున సర్థార్ పుటం పురుషోత్తం రావుకు బాధ్యతలు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ పుట్టినరోజు, కౌన్సిల్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన పురుషోత్తం రావులను శాలువాలతో సత్కరించారు.సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఆకుల రజిత్,చందు జనార్థన్,ఊసా రఘు, లవంగాల అనిల్ కుమార్,మరికల్ పోత సుధీర్ కుమార్,కూసం శ్రీనివాసులు, జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.ప్లీనరీ ఏర్పాటు,దాన్ని విజయవంతం చేయడానికి సంబంధించి కొండా దేవయ్య, పురుషోత్తం రావు,వెంకటేశ్వర రావు, రాంమోహన్,విఠల్,కనకయ్య,అనిల్ తదితరులతో ఒక కమిటీని కౌన్సిల్ నియమించింది.