ఒవైసీ ముత్తాత తులసీ దాస్ హైదరాబాద్, ఆగస్టు 21 : హిందూ బ్రాహ్మణుడైన తులసీరామ్‌దాస్‌ను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ముత్తాతగా పేర్కొంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసదుద్దీన్ ఒవైసీ ముత్తాత హిందూ బ్రాహ్మణుడని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రశ్నించడం తీవ్ర దుమారం లేపుతోంది. అసదుద్దీన్ ఒవైసీ, అతని ముత్తాత ఫరూక్ అబ్దుల్లా, జిన్నాలు హిందువులనే వాదన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. నేటి ముస్లీంలుగా పిలవబడుతున్న వారందరికీ హిందూ పూర్వికులు ఉన్నారని, బలవంతంగా మతమార్పిడి చేయడం వల్ల వారు ముస్లింలుగా మారారని, వారిలో హిందూ ఫోబియా వ్యక్తం అవుతుందంటూ డాక్టర్ పూర్ణిమా అనే ట్విటర్ యూజర్ పేరిట షేర్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా ముత్తాత బాల్ముకుంద్ కౌల్.. అతనొక హిందూ బ్రాహ్మణుడు. ఎం జిన్నా తండ్రి హిందూ ఖోజా కులానికి చెందిన జిన్నాభాయ్ ఖోజా అని ఆ పోస్ట్ సారాంశం. ఐతే దీనిపై ఎంపీ అసదుద్దీన్ తాజాగా తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.‘సంఘీలు మా వంశంలో బ్రాహ్మణ పూర్వికులను కనిపెట్టడం నాకు ఎప్పుడూ ముచ్చటేస్తుంటుంది. మన పనులకు మనమందరం సమాధానం చెప్పుకోవాలి. మనమందరం ఆడమ్, హవ్వా పిల్లలం. ఇక నా విషయానికొస్తే, ముస్లింల సమాన హక్కులు, పౌరసత్వం కోసం ప్రజాస్వామ్య పోరాటం చేయడాన్ని ఆధునిక భారతదేశ ఆత్మగా భావిస్తాను. అది ఎప్పటికీ ‘హిందూఫోబియా’ కాదు’ అని తన ట్వీట్‌లో ఓవైసీ ధీటుగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియా సంగతి పక్కనపెడితే.. మతమార్పిడులపై గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ‘భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ హిందువులే. 600 ఏళ్ల క్రితం కాశ్మిర్‌లో ముస్లింలు ఎక్కడున్నారు? వారంతా కాశ్మీర్ పండిట్లే. ఇప్పుడు అక్కడ ఉన్న ముస్లింలంతా బలవంతంగా ఇస్లాంలోకి మారినవారు. మన దేశంలోని ముస్లింలలో అధిక మంది హిందూ మతం నుంచి ముస్లీం మతంలోకి మారిన వారి వారసులని’ గులాం నబీ ఆజాద్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలకు కౌంటరిస్తూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఏమన్నారంటే.. ‘తన పూర్వీకుల గురించి అతనికి ఎంతవరకు తెలుసో నాకైతే తెలియదు. అతని పూర్వీకులు కోతులుగా బతికిన చోటికి తిరిగి వెళ్లమని నేను అతనికి సలహా ఇస్తున్నానంటూ’ గులాం నబీ ఆజాద్‌కు చురకలంటించారు