పాస్టర్ ప్రవీణ్ హత్య.. ప్రమాదమా
రాజమండ్రి, మార్చి26, (వాయిస్ టుడే)
Pastor Praveen's murder.. was it an accident?
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. క్రైస్తవ మత ప్రచారకుడిగా, బోధకుడుగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సుపరిచితుడు. అలాంటి వ్యక్తి సడన్ గా చనిపోయారనే వార్త క్రైస్తవ సమాజం నమ్మలేకపోతోంది. అదే సమయంలో ఆయనది అనుమానాస్పద మృతిగా తేలడం ఇక్కడ సంచలనంగా మారింది.ప్రవీణ్ పగడాల విజయవాడనుంచి రాజమండ్రి వెళ్లి, రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లేటప్పుడు బుల్లెట్ పై వెళ్తూ రోడ్డుపక్కన చనిపోయి పడి ఉన్నారు. స్థానికులు కొందరు ఆవైపుగా వెళ్తూ ఆయన మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన డెడ్ బాడీ చూసినవారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన్ని ఎవరో చంపి పడివేసి ఉంటారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఆయన మృతదేహంపై గాయాలున్నాయని, పెదాలపై కూడా గాయాలున్నాయని, రాడ్డుతో కొట్టినట్టు గాయాలు కనపడుతున్నాయని అంటున్నారు. ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించగా అక్కడ క్రైస్తవ సోదరులు ధర్నా చేపట్టారు.ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు, క్రైస్తవులు రాజమండ్రిలో ధర్నా చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదులు ఆయన్ని చంపి ఉంటారని వారు అంటున్నారు. గంటలతరబడి రోడ్డుపై ఆందోళన చేస్తున్నా.. తమని ఎవరూ పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించాలని కోరారు. గతంలో ఆయన్ను చాలామంది బెదిరించేవారని, ఆయనపై దాడి చేస్తామని కూడా హెచ్చరించారని అంటున్నారు. ఇటీవల ప్రవీణ్ పగడాల కూడా తనపై దాడి జరిగే అవకాశం ఉందని అనుమానించారని, దానిపై ఆయనే ఒక వీడియో పోస్ట్ చేశారని చెబుతున్నారు. తనకు ప్రాణ భయం ఉందని ప్రవీణ్ పగడాల చెప్పినా కూడా పోలీసులు ఆయనకు రక్షణ కల్పించలేకపోయారని క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ.. ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల.. రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేదీ తెలియడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బైక్ మీద వెళ్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని స్నేహితులు, అనుచరులు, కొంతమంది పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఘటనాస్థలికి వరకూ మొత్తం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలని టీడీపీ నేత, మహాసేన రాజేష్ సైతం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ప్రవీణ్ పగడాల క్రైస్తవ మత బోధకుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుచరుల్ని సంపాదించుకున్నారు. కడప జిల్లాతో ఆయనకు అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో నివశిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోధనకోసం ఆయ అప్పుడప్పుడు వివిధ ప్రాంతాలకు వస్తుంటారు. ఈ క్రమంలో రాజమండ్రి వద్ద కార్యక్రమాలకు వచ్చిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తోంది.ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు క్రైస్తవ మత ప్రచారకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకప్పిటి సినీ హీరో, ప్రస్తుతం మత ప్రచారకుడిగా ఉన్న రాజా కూడా ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రవీణ్ మృతి బాధాకరం అని అన్నారు. ఆయన లేని లోటు తీరదని, భౌతికంగా మాత్రమే ఆయన క్రైస్తవ సమాజానికి దూరమయ్యారని చెప్పారు. ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయాలంటూ పిలుపునిచ్చారు.ప్రవీణ్ పగడాల మరణంపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆయన డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. ఈ విషయంలో పోలీసుల నుంచి ప్రకటన విడుదలైతే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. అప్పటి వరకు ప్రవీణ్ పగడాల మృతిని ప్రమాదంగా ధృవీకరించలేం, అదే సమయంలో అది హత్య అనేది కూడా నిర్థారించలేని పరిస్థితి.