ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతల ప్రచారం ఊపందుకుంది. ఓవైపు కాంగ్రెస్పై మరోవైపు వైఎస్సార్సీపీపై విమర్శలు కురిపిస్తూ ప్రచారంలో ఈ నేతలు జోరు సాగిస్తున్నారు.
ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు కుప్పిస్తున్నారు. ఈ ఐదేళ్లలో జగన్ ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్నారు. ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసిన జనసేనాని.. ఇక వరుస బహిరంగ సభలతో బిజీ కానున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి నుంచి 3 రోజులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ సభలు ఉండనున్నాయి. మూడు రోజుల్లో 6 నియోజకవర్గాల్లో పవన్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం కోనసీమ జిల్లా రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రేపు కాకినాడ జిల్లా పెద్దాపురం, కాకినాడ గ్రామీణంలో పవన్ పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు.