పవన్ పర్యటన ఆసక్తికరం
ఏలూరు, ఫిబ్రవరి 21
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీడీపీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు ఇళ్లకు వెళ్లి కలిశారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ – జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలని.. దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే మనందరి లక్ష్యమని వారికి వివరించారు. తాను వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేస్తున్నానని.. తనకు మద్దతు ఇవ్వాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఓ చోట పోటీపై స్పష్టత వచ్చినట్లయింది. అలాగే, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీపాకా సత్యనారాయణ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకుముందు భీమవరంలో పవన్ కు ఇరు పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనసైనికుల నినాదాలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆయన పర్యటన సాగింది. భీమవరం పర్యటన అనంతరం జరిగే టీడీపీ – జనసేన నేతల సమావేశంలో పొత్తులు, ఎన్నికల కార్యాచరణపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలి.? ఎక్కడ జనసేన బలంగా ఉంది.? అనే దానిపై భేటీలో నేతల అభిప్రాయం తీసుకోనున్నారు.మరోవైపు, భీమవరం పర్యటన అనంతరం పవన్ కల్యాణ‌్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. పొత్తులు, ఏపీలో రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. అటు, జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు పవన్ సమన్వయకర్తలను నియమించారు. ఈ నెల 22 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆయన ఖరారు చేయనున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా కలిసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అధిష్టానాన్ని కలవనున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు, సీట్ల వ్యవహారంపై చర్చించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాతే జనసేన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు జనసేన నాయకులు అంటున్నారు.ఇక, భీమవరం నుంచే పోటీ చేస్తానని టీడీపీ నేతలకు చెప్పిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి.. ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వెల్లడించారు.
పవన్ పర్యటన ఆసక్తికరం
- Advertisement -
- Advertisement -