14.7 C
New York
Tuesday, April 16, 2024

అవయవ దానము పై ప్రజలకు అవగాహన అవసరం  

- Advertisement -

అవయవ దానము పై ప్రజలకు అవగాహన అవసరం  
(నేడు జాతీయ అవయవ దాన దినోత్సవ సందర్భంగా)

హైదరాబాదు జనవరి 27 : సృష్టిలో మానవుడి జీవితం నీటి బుడగ లాంటిది…  ఏ క్షణములో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే కొందరు పూర్తి ఆయుష్షుతో నిండు నూరేళ్లు జీవిస్తారు.  మరి కొందరు వివిధ రకాల వ్యాధులు ,అనుకోని ప్రమాదాల కారణంగా అర్ధాంతరంగా తనువు చాలిస్తుంటారు. ఎవరు ఎన్ని రకాలుగా పరమాత్ముడిని చేరినా… చిరంజీవిలా చరిత్రలో చిరస్థాయిగా నిలిచేది అవయవ దాతలు మాత్రమే.  తాము  చనిపోతున్నామని ముందే తెలిసినప్పటికీ తమ దేహం మట్టిలో కలవకముందే శరీరంలోని అవయవ దానాలు చేసి మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.  కాగా చనిపోయిన తమ కుటుంబ సభ్యుల అవయవాలను దానం చేసేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.  ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి ఆధ్వర్యంలో జీవితకాల సభ్యులు ఊరు రా తిరుగుతూ అవయవ దానము పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  ఈ మేరకు ఆకస్మాత్తుగా మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి దానం చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు.
వైద్యుల నిర్ధారణ తర్వాతే:
బ్రెయిన్ డెత్ అయిన రోగి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నప్పుడు ఇద్దరు న్యూరాలజిస్టులు అతని పరీక్షిస్తారు. ఇలాంటి రోగులకు గుండె, కిడ్నీ, లివర్ ఇలా ఒక్కొక్కటి క్రమేనా పని చేయడం మానేస్తాయి. అలాంటి సమయంలో వైద్యులు అతడు తిరిగి కోలుకునే అవకాశం లేదని నిర్ధారించిన తర్వాత న్యూరాలజిస్టుల అనుమతి, బంధువుల అనుమతితోనే అవయవాలను సేకరించవచ్చు. బంధువుల అనుమతితో రోగి బ్లడ్ గ్రూపును పరీక్షించి, అదే బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తికి అవసరమైన అవయవాలను మార్పిడి చేస్తారు.
అవయవ దానముతో పునర్జన్మ:
మధుమేహo, రక్తపోటు తదితర కారణాలతోపాటు మందుల అధికంగా వాడటం వల్ల కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుని జీవిస్తున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. మద్యం సేవించడం, ధూమపానం కారణంగా ఊపిరితిత్తులు, లివర్ పాడైపోవడంతో పాటు గుండె దెబ్బతిని మంచానికి పరిమితమైన వారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో చాలామందికి అవయవ మార్పిడి ద్వారానే పూర్తిగా కోరుకునే వీలుంటుంది. కొందరికి వారి బంధువులు అవయవాలు దానం చేస్తుండగా మరికొందరికి అవకాశం లేకపోవడంతో వారు అర్ధాంతరంగా చదువు చాలిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి పునర్జన్మ ఇచ్చేందుకు వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు జీవన్ దాన్ సంయుక్త ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. ఈ మేరకు వారు నిత్యము ఊరు రా తిరుగుతూ అవయవ దానము పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి ప్రాణాలు కాపాడుతున్నామని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు.
అవయవ దానం ఎవరు చేయవచ్చు:
ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడినా ఇతర కారణాల వల్ల కానీ గంటల వ్యవధిలో మరణిస్తాడని తెలిసినప్పుడు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతితో ప్రధానమైన ఐదు అవయవాలను తీసుకొని వాటి అవసరమున్న ఎనిమిది మందికి అమర్చి పునర్జన్మ ప్రసాదించవచ్చు. రోడ్డు ప్రమాదాలలో తీవ్ర గాయాలైన మృత్యువాత పడుతున్న వారిని మనము నిత్యం చూస్తూనే ఉన్నాము. తలకు బలమైన గాయమై బ్రెయిన్ డెత్ కు గురవుతుంటారు. అలాంటి వారిని వెంటిలేటర్ పై ఉంచడం మినహా వారి ప్రాణాలు కాపాడడం సాధ్యపడదు. అయితే ఈ సమయంలో వారి అవయవాలు దానం చేసేందుకు బంధువులు ముందుకు రావాల్సి ఉంది. మరికొందరిలో హై బీపీతో మెదడులో రక్తస్రావం అయి బ్రెయిన్ డెత్ కు గురై దాదాపు మృత్యువుకు దగ్గరలో ఉంటారు. అలాంటి వారి నుంచి ఆరోగ్యంవంతమైన అవయవాలు సేకరించి కొందరికి పునర్జన్మ కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రమాదంలో బ్రెయిన్ డెత్ కు గురైనప్పుడు అతడి నుంచి రెండు కళ్ళు. రెండు కిడ్నీలు, గుండె, లివరు, ఊపిరితిత్తులు సేకరించి వాటిని ఏడుగురికి అమర్చుతారు. చిన్న పేగులు, ఎముకలు, మూలుగను కూడా సేకరించవచ్చు అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు.
హామీ పత్రాల సేకరణ:
ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల చనిపోతున్న వారు అవయవ దానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు జీవన్ దాన్ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ మేరకు అవయవ దానము చేయాలని నిర్వాహకులు జిల్లాలో నిత్యం అవగాహన సదస్సులు, ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే అవయవ దానాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నవారి నుంచి హామీ పత్రాలను సేకరించి వారికి డోనార్ కార్డులు కూడా అందజేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జిల్లాలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చనిపోయిన తర్వాత తమ అవయవాలను దానం చేస్తామని హామీ పత్రాలను అందజేస్తున్నారు. అలాగే ఏదైనా ఆసుపత్రిలో రోగి బ్రెయిన్ డెత్ అయ్యారని తెలిస్తే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి అవయవ దానము చేసే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి పేర్కొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!