కనులు పండుగగా పూరి జగన్నాథ్ రథయాత్ర
సకల లోకాలనూ పాలించే జగన్నాథుడు సాకారుడై కొలువైన పుణ్యస్థలి పూరీ దివ్యక్షేత్రం. శ్రీమహావిష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా అనుగ్రహిస్తున్న అద్భుత తీర్థం పూరీ జగన్నాథ ఆలయం. ఆషాఢశుద్ధ విదియ రోజున ఆ దివ్యమూర్తులను రథంపై ఊరేగించడమే జగన్నాథయాత్ర.
రథయాత్ర తొలి రోజు ప్రధాన ఆలయం నుంచి స్వామివార్లను ఊరేగిస్తారు. అశేష భక్తజనావళి మధ్య సాయంత్రానికి సమీపంలోని గుండిచా మందిరానికి తరలిస్తారు. తిరిగి తొమ్మిదో రోజున తమ మందిరానికి స్వామి సపరివారంగా చేరుకుంటాడు. జగన్నాథుని రథాన్ని ‘నంది ఘోష’, ‘గరుడ ధ్వజ’ అని; బలభద్రుని రథాన్ని ‘తాళధ్వజ’ అని; సుభద్ర రథాన్ని ‘దర్పదళ’, ‘పద్మధ్వజ’ అని పిలుస్తారు. ఈ శరీరం రథం; ఇంద్రియాలు గుర్రాలు; శక్తియుక్తులు పగ్గాలు- అనేది జగన్నాథ రథయాత్రలో దాగి ఉన్న ఆధ్యాత్మిక ప్రబోధం. నడిచే ఈ రథంలో ఆత్మ స్వరూపంలో కొలువై ఉన్నవాడే పరమాత్మ. ఆయనే జగన్నాథుడు. చైతన్యకారకుడై ఆయన ముందుకు నడిపిస్తున్నప్పుడే.. దేహమనే రథానికి శోభ. జగతి రథాన్ని కదిలించే జగన్నాథుని స్మరిస్తూ తరించాలన్నదే ఈ రథయాత్రను దర్శించడంలోని ఆంతర్యం!