కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నారు..
సొంత పార్టీ నేతలపై రాహుల్ సంచలన ఆరోపణలు
Rahul's sensational allegations about being in Congress but working for BJP
న్యూ డిల్లి మార్చి 8
సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్ కాంగ్రెస్ లోని కొందరు నేతలు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో కలిసి పనిచేసే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రంలో మన బాధ్యతలను నెరవేర్చనంత వరకూ అధికారం ఇవ్వాలని గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ రాణించాలంటే… కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మద్దతిస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. కమలం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అలాంటి వారిని బయటకు పంపుతాం. దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో లేని బీజేపీ పాలిత రాష్ట్రంలో పార్టీని ప్రక్షాళన చేయడానికి అవసరమైతే 40 మంది నాయకులను తొలగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.