తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి.. పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. మర్యాదపూరకంగా ఆమెను కలిశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా తన పేరును ఖరారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పట్ల కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ.. సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ.. ఆయనపైనే నమ్మకం ఉంచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను భుజాలపై ఉంచారు. వారి నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు రేవంత్ రెడ్డి. పార్టీకి ఘన విజయాన్ని అందించారు.
అదే భరోసాతో- ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా రేవంత్ రెడ్డికే అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తోన్న మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ- రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. రేవంత్ అభ్యర్థన మేరకు గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. తదితరులు రానున్నారు.