కరీంనగర్‌లో సేవా జ్యోతి కార్యక్రమం

- Advertisement -
'Seva Jyothi' program in Karimnagar
‘Seva Jyothi’ program in Karimnagar

కరీంనగర్‌లో సేవా జ్యోతి కార్యక్రమం

కాంగ్రెస్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

‘Seva Jyothi’ program in Karimnagar

కరీంనగర్, అక్టోబర్ 07 (వాయిస్ టుడే): దేశం కోసం, ప్రజల కోసం 25 ఏళ్లుగా సాగిస్తున్న ప్రజా సేవకు గుర్తుగా ‘సేవా జ్యోతి’ కార్యక్రమాన్ని నిర్వహించామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన సేవా జ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చిరకాలం సేవలందించాలని ప్రజలంతా కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రతి పేదింట్లో వెలుగులు నింపడంతో పాటు దేశాభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పార్టీల మాటలు విని మోసపోతున్న యువత వాస్తవాలను తెలుసుకోవాలని బండి సంజయ్ సూచించారు. మోదీ రాజకీయ నేపథ్యం, చరిత్ర, దేశానికి చేసిన సేవలను పరిశీలించాలని కోరారు. 2014కు ముందు, ప్రస్తుతం భారత్ సాధించిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.

మోదీకి సొంత కుటుంబం లేదని, దేశ ప్రజలే ఆయన కుటుంబమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయనకు డబ్బులు, బినామీ ఆస్తుల అవసరం లేదని అన్నారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయినా భుజాన సంచి వేసుకుని ప్రజాసేవలో కొనసాగగల మహనీయుడు మోదీ అని పేర్కొన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ సేవా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

ఈసీపై ఆరోపణలు సరికాదు

ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని బండి సంజయ్ అన్నారు. ప్రజలు విచక్షణతో ఓటు వేస్తున్నందువల్లే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలను బదనాం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదమని హెచ్చరించారు.

జ్ఞానేశ్ కుమార్ అంశాన్ని కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. రాజ్యాంగ సంస్థపై దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎప్పుడైనా ఎన్నికల సంఘాన్ని కలవచ్చని, మరి అపాయింట్‌మెంట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వందలాది మందితో వెళ్లి దాడి చేస్తే పోలీసులు అడ్డుకోకుండా ఏం చేస్తారని అన్నారు.

‘ఓటు చోరీ’పై కాంగ్రెస్‌కు పేటెంట్ హక్కులు ఉన్నాయని బండి సంజయ్ విమర్శించారు. దేశంలో తొలిసారిగా ఓటు, సీటు చోరీ చేసింది కాంగ్రెస్‌నే అని ఆరోపించారు. దేశంలోని పీసీసీలన్నీ తొలి ప్రధాని అభ్యర్థిగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరును ప్రతిపాదించినప్పటికీ, ఒక్క పీసీసీ మద్దతు కూడా లేని నెహ్రూను ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని వ్యాఖ్యానించారు.

అనర్హుల ఓట్లు తొలగించడంలో తప్పేముంది?

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే సర్ ప్రక్రియ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన తర్వాత కూడా కొంతకాలం ఆయన పేరు ఓటర్ల జాబితాలో కొనసాగిందని, సర్ ప్రక్రియలో ఆ ఓటును తొలగించారని పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి ఓటును తొలగించడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా 2.8 కోట్ల మంది మరణించారని, వారి పేర్లతో ఉన్న ఓట్లన్నీ తొలగించాలని కాంగ్రెస్‌నే కోరిందని అన్నారు. తెలంగాణలో 70 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ చెప్పలేదా? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, రాజస్థాన్‌లో 45 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు.

కేరళలో సర్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రమేశ్ చెన్నితల ప్రకటించారని ఆయన అన్నారు.

అక్రమ ఓట్లపై కాంగ్రెస్ వైఖరి ఏంటి?

తెలంగాణలో 2014కు ముందు లక్షలాది మంది రోహింగ్యాలు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోనే 30 వేలకు పైగా రోహింగ్యాల ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశానికి ఎన్నికల సంఘానికి, బీజేపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

ఎన్నికల ప్రధాన కమిషనర్ తప్పు చేస్తే సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని సూచించారు. స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగ సంస్థలపై బురద చల్లడం సరికాదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అక్రమంగా ఉన్న ఓట్లను తొలగించాలా? వద్దా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు

కేసీఆర్ భూ వివాదాలపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్‌కు లేదని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై పోరాడే దమ్ము బీఆర్ఎస్‌కు లేదని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు.

తనకు బీజేపీ ఎన్నో పదవులు ఇచ్చిందని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని బండి సంజయ్ అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని, కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం,నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా,డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular