- Advertisement -
షాడో ఎమ్మెల్యే….
Shadow MLA….
వరంగల్, డిసెంబర్ 26, (వాయిస్ టుడే)
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించి, మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఎర్రబెల్లిపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరపున అమెరికాలో స్థిరపడ్డ ఝాన్సీరెడ్డి సిద్ధంకాగా, పౌరసత్వ సమస్యతో పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఆమె కోడలు యశస్వినిరెడ్డి బరిలో నిలిచి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై భారీ మెజారిటీతో గెలుపొందారు.యశస్విని రాజకీయాలకు పూర్తిగా కొత్తముఖం అవ్వడంతో ఆమె తరపు ఎన్నికల ప్రచారంలో ఝాన్సీరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. పాలకుర్తి ప్రజలకు వందల హామీలు ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటుగా తన సొంత నిధులతో సమస్యలు తీర్చి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానాలు గుప్పించారు. ఝాన్సీ రెడ్డి మాటలు విశ్వసించిన ఓటర్లు ఆమె కోడలు యశస్వినిరెడ్డికి పట్టం కట్టారు. కోడలి విజయం తర్వాత కూడా ఝాన్సీరెడ్డే షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు.అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ఝాన్సిరెడ్డి వ్యక్తిగత సర్వే చేయించుకున్నారంట. ఆ సర్వేలో ఝాన్సీ రెడ్డికి దిమ్మతిరిగే ఫీడ్ బ్యాక్ ఇచ్చారంట పాలకుర్తి ప్రజలు. ఓట్ల కోసం గ్రామగ్రామానికి తిరిగి దండాలు పెట్టిన ఆమె, కలుద్దామని వెళ్తే కనీసం సమయం ఇవ్వట్లేదని మండిపడ్డారంట. ఆమె చుట్టూ చేరిన కోటరీ కలవడానికి వెళ్తే.. ఎందుకు వస్తున్నారంటూ వెళ్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారంట. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న పాలకుర్తి సీనియర్ నేతలు సైతం సర్వేలో పూర్తి నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యారంట ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారిని కాదని పదవులకు రేట్లు ఫిక్స్ చేసి అమ్ముకున్నారని, సంవత్సరం మొత్తం సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాల ఖర్చులు భరించేలా ఒప్పందాలు చేసుకొని పోస్టులు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారంట.ఇళ్లు లేని పేదలకు సొంతంగా ఇల్లు కట్టిస్తానని, నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇలా ఝాన్సీరెడ్డి చాలా హామీలే ఇచ్చారు. ఆమె తాజాగా చేయించుకున్న సర్వేలో పాలకుర్తి వాసులు వాటన్నిటిపై నిలదీశారంటున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రతీ తండాకు పదుల సంఖ్యలో హామీల వర్షం కురిపించిన ఝాన్సీ రెడ్డి ఇప్పుడు వాటి ఊసే ఎత్తట్లేదని తండా వాసులు సర్వే చేయడానికి వచ్చిన వారి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారంట.సర్వేలో వ్యతిరేకత ఆ రేంజ్లో ఉంటే గ్రౌండ్‌లెవల్లో ఝాన్సీరెడ్డిపై వ్యతిరేకత అదే రేంజ్లో కనిపిస్తోందంటున్నారు. తమ గ్రామాల్లోని సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వద్దకు వెళ్తే ఝాన్నీరెడ్డికి కోపం వస్తుందంట. ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యే అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి కానీ, అసలు తానే ఎమ్మెల్యేనని ఆమె ఫీలవుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చిర్రుబుర్రులాడుతున్నారు. ఆ క్రమంలో యశస్విని రెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేసిన గ్రామస్థాయి కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు.. ఝాన్సీ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ప్రజాసేవ పక్కనపెట్టి ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎవరైనా పద్దతి మార్చుకోమని నచ్చచెప్పాలని చూస్తే.. నా మాటే శాసనం.. అని సినీ డైలాగ్‌లు చెప్తున్నారంట.ఝాన్సీ రెడ్డి నియంతృత్వ వైఖరిపై పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మహామహాులకే చెప్పులు దండలు వేసామని, తమ గ్రామ సమస్యలు తీర్చకుంటే ఊరుకునేది లేదని సర్వేకు వెళ్ళిన వారికి పలుచోట్ల ఘాటుగా స్పష్టం చేశారంట. అదలా ఉంటే ప్రస్తుతం పాలకుర్తిలో ఝాన్సీరెడ్డి స్వయంగా సర్వే చేయించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తన కోడల్ని రాజీనామా చేయించి ఉపఎన్నిక ద్వారానే ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్నారా..? అందుకే సర్వేలు చెయించుకుంటున్నారా? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -