లోకకల్యాణార్థం శాంతిహోమం
శ్రీశైలం
Shanti Homa for the welfare of the world
లోకకల్యానార్థం గురువారం రోజు శ్రీశైల దేవస్థానం శాంతిహోమాన్ని నిర్వహించింది. రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ ఉత్తర్వుల మేరకు ఈ శాంతిహోమాన్ని జరిపించడం జరిగింది. ఈ రోజు వేకువజామున గం. 5.00ల నుంచి ఆలయప్రాంగణంలోని అమ్మవారి యాగశాలలో ఈ హోమం జరిపించబడింది. ఈ హోమ ప్రారంభపూజలలోను మరియు పూర్ణాహుతి కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు.కాగా ఈ ఉదయం ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్వఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ నిర్వహించబడింది. గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిపించబడింది. వృద్ధి మరియు అభ్యుదయాల కోసం ఈ పుణ్యహవచనం జరిపించబడింది. తరువాత పంచగమప్రాశన కార్యక్రమము జరిగింది.అనంతరం ఋత్విగ్వరణం జరిపించబడింది. ఈ ఋత్విగ్వరణంలో శాంతిహోమములో ఆయా వైదిక కార్యక్రమాలను నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానించడం జరిగింది. తరువాత హోమ కార్యక్రమాలలో భాగంగానే మండపారాధన, పవమానహోమం, కుష్మాండహోమం రాష్ట్రమ్మసూక్త హోమం, శాంతిహోమం, పూర్ణాహుతి జరిపించబడ్డాయి. ఈ శాంతిహోమ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భాగవతంలోని గంగావతరణఘట్ట పారాయణం కూడా జరిపించబడింది.
ఈ హోమ కార్యక్రమములో పలువురు అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.




