ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించగా.. వారికి ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు.
భారత పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు అవార్డు స్వీకరించారు. కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్, చరణ్‌సింగ్ కుటుంబసభ్యులకు కూడా భారతరత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. అద్వానీకి మాత్రం ఇంకా అందించలేదు. ఆదివారం రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అద్వానీ ఇంటికెళ్లి అవార్డు ప్రదానం చేయనున్నారు.
కాగా, పీవీ పూర్తి పేరు.. పాములపర్తి వేంకట నరసింహారావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ఆయన స్వస్థలం. మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 972లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా సేవలందించారు.
1971లో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావును నియమించింది. రెండు సంవత్సరాల పాటు సీఎం పదవిలో కొనసాగిన పీవీ.. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పి.. జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పారు. 1977లో తొలిసారి హనుమకొండ లోక్‌సభస్థానం పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1980 మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1984, 1989లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా సేవలందించారు.
1991లో అనూహ్యంగా ఆయన్ను ప్రధానమంత్రి పదవి వరించింది. ప్రధాని పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా మనదేశ చరిత్రలో నిలిచిపోయారు వీపీ నరసింహారావు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, గాడితప్పిన ఆర్తిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అంతేకాదు బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలు కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయి. అలాంటి పీవీకి భారతరత్న అవార్డును ఇవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.