- Advertisement -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
Speaker Prasad Kumar distributed CM Relief Fund cheques
వికారాబాద్
పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సభాపతి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు.గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కొత్తగా నూతన పథకాలను తీసుకువస్తూ ప్రజల సంక్షేమ, అభివృద్ధి దిశగా ప్రభుత్వ పని చేస్తున్నట్లు సభాపతి తెలిపారు. రైతు భరోసాలో భాగంగా పరిమితి లేకుండా సాగు చేసే ప్రతి భూమికి సంక్రాంతి నుండి రైతు భరోసాను వర్తింప చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ కార్డు ఉన్న లబ్ధిదారులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నట్లు సభాపతి తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గానికి 12 వేల ఇండ్లు మంజూరు అయ్యాయని, మరో విడతలో కూడా ఇంకా ఇల్లు మంజూరు అవుతాయని తెలిపారు. నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని వారిని గుర్తించి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం గావించి అందజేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం పైన, మాపైన ప్రజల ఆశీస్సులు, దేవుని దీవెనలు ఉండేలా ప్రార్థించాలని సభాపతి కోరారు.
ముందుగా మార్కెట్ కమిటీ భవన ఆవరణలో 70 లక్షల వ్యయంతో చేపట్టే పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన మరమ్మతులు, మార్కెట్ యార్డులో షెడ్ లకు, కార్యాలయానికి విద్యుద్దీకరణ మరమ్మత్తు పనులు చేపట్టనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, ఆర్డీవో వాస్తు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ పర్సన్ ఇంచార్జ్ ఎండి రియాజ్, కార్యదర్శి ఎండి ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -