జగిత్యాల జిల్లా బ్యూరో/రాజేష్ బొంగురాల (సీనియర్ జర్నలిస్ట్) వాయిస్ టుడే ఆగష్టు 30: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం బీముని దుబ్బలో అక్క అనుమానస్పద స్థితిలో మృతి చెందగా చెల్లి ఓ యువకుడితో పరారీలో ఉండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం బీమునిదుబ్బలో బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి ముగ్గురు పిల్లలు, దీప్తి ఓ సాఫ్ట వేర్ కంపెనీలో సుమారు ఏడాదిన్నర క్రితం చేరింది. ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది. చందన ఇటీవల బీటెక్ పూర్తి చేయడంతో ఇంటివద్దనే ఉంటుంది. సాయి బెంగళూర్లో డిగ్రీ చదువుతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి దగ్గరి బంధువుల గృహప్రవేశం హైదరాబాద్ లో ఉండటంతో ఆదివారం భార్య మాధవితో కలిసి వెళ్లగా, ఇంట్లో దీప్తి, చందన ఇద్దరే ఉన్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు ఇద్దరు కూతుర్లతో చరవాణీలో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం కూతుర్లకు ఫోన్ చేయగా పెద్దకూతురు దీప్తి ఫోన్ తీయకపోగా, చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందు నివాసమున్న వారికి ఫోన్ చేసి తమ కూతుర్లు ఫోన్ తీయడం లేదని చెప్పారు. ఇంటి ముందున్న వారు వెళ్లి తలుపులు తీసి చూడగా సోఫాలో దీప్తి మృతి చెంది ఉన్నట్లు వారికి కనిపించింది. చందన ఇంట్లో కనిపించకపోవడంతో విషయం తల్లిదండ్రులకు చరవాణీ ద్వారా సమాచారం అందించారు స్థానికులు. విషయం పోలీసులకు తెలియడంతో పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చెల్లెలు చందన ఆచూకికోసం కోసం పోలీసులు కోరుట్ల బస్టాండ్ లోని సీసీ కెమరాలను పరిశీలించగా చందన, ఓయువకుడు ఉదయం 5.12 నిమిషాల నుంచి 5.16 నిమిషాల వరకు నిజామాబాద్ బస్సులు ఆగేచోట కూర్చోని ఉన్నట్లు రికార్డు అయింది. హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి చేరుకుని కూతురు మృతదేహంపైపడి బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.