గులాబీకి దక్కని సానుభూతి…
హైదరాబాద్, జూలై 2,
తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం జోరు మీద ఉంది. రోజుకో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. కేసీఆర్‌తో సమావేశం కోసం ఫామ్ హౌస్ కు వెళ్లిన వారు తర్వాతి రోజు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రారంభమైన చేరికలు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంత మంది అదే దారిలో ఉన్నారు. సహజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే.. సామాన్యమైన విషయం కాదు. కానీ అది ఎన్నికలకు ముందు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అందుకే ఎక్కువ మంది ఆ పార్టీలో చేరికకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీలో అసంతృప్తి ఎక్కువైనా సరే చేర్చుకుంటున్నారు కూడా. బీఆర్ఎస్ ను బలహీనం చేయడమే తన టార్గెట్ అని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అంటే బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునే వరకూ చేరికలు సాగుతూనే ఉంటాయని రేవంత్ చెబుతున్నట్లయింది.కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఆకర్షించడంపై భారత రాష్ట్ర సమితి విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ ఎం చెప్పింది .. ఏం చేస్తుందని ప్రశ్నించడం ప్రారంభించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ పిరాయింపులకు వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మేనిఫెస్టోలోనూ పెట్టారు. పాంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారంటీల్లో ఫిరాయింపుల నిరోధకం కూడా ఒకటి. కానీ తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఎవరికీ తెలియకుండా రేవంత్ రెడ్డి మాత్రమే ప్రోత్సహిస్తున్నారా అంటే.. అదేమీ లేదు హైకమాండ్ కూడా సపోర్టు చేస్తోంది. చేరికల విషయంలో సీనియర్లతో కోఆర్డినేట్ చేసుకోవాలని చెబుతోంది కానీ.. ఆపరేషన్ ఆకర్ష్ వద్దని మాత్రం చెప్పడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి తన రాజకీయ చాతుర్యాన్ని అంతటా ప్రయోగిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని లాగేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పెద్దగా విజయవంతం కాలేకపోతోంది. దీనికి కారణం ఆ పార్టీ గతంలో.. ఇప్పుడు చేసిన రెండు తప్పులే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని అవసరం లేకపోయినా చేర్చుకుని ఆ పార్టీ ఎల్పీల్నీ విలీనం చేసుకోవడం.. మరొకటి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే… కూల్చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం.తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పాటు చక్రం తిప్పారు. తెలంగాణలో ఆయనకు తిరుగులేదు. అలా లేకుండా చేసుకోవడానికి ఆయన అనుసరించిన అస్త్రం చేరికలు, ఏ పార్టీని వదిలి పెట్టలేదు. చివరికి కమ్యూనిస్టుల్ని కూడా వదిలి పెట్టలేదు. మొదటి విడత సాధారణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల తరపున గెలిచిన వారందర్నీ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. దాదాపుగా సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేసుకున్నారు. 2018లో రెండో సారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేల అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టలేదు. పలువురు ఎమ్మెల్యేలకు పదవులు ఆఫర్ చేసి మరీ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించారు. మొదటి విడతలో టీడీపీ తరపున గెలిచిన తలసానితో మంత్రిగా ప్రమాణం చేయించారు. ఇలా తెలంగాణలో ఎవరు గెలిచినా బీఆర్ఎస్ లో చేరిపోవాలన్న వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఎవరిపైనా స్పీకర్ చర్యలు తీసుకోవడం.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రయోగించడం వంటివి చేయలేదు. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న కేసీఆర్‌కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే ప్రజాతీర్పును అపహాస్యం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదంటూ ప్రకటనలు చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేది. అలా తెప్పించడానికి బీఆర్ఎస్ తనను తాను త్యాగం చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా కేసీఆర్ కు ఏదీ కలసి రాలేదు. కానీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు మాత్రం బలంగానే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీల్ని విలీనం చేసుకుందని పదే పదే గుర్తు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రజల్లో తమపై వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. అదే సమయంలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారని కూడా ఆరోపిస్తున్నారు. తాము చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇవి తెలంగాణ సమాజంలోకి బలంగా వెళ్తున్నాయి. చేరికలు..ఫిరాయింపులు అసలు మొదటి బెట్టిందే బీఆర్ఎస్ అన్న భావనకు వస్తున్నారు. గతంలో కేసీఆర్ చేశారు కాబట్టి.. పైగా ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తున్నారు కాబట్టి .. కాంగ్రెస్ పార్టీ చేరికల్ని ప్రోత్సహించినా తప్పు లేదన్న భావనకు ప్రజలు వచ్చేలా చేయడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోంది. ఫలితంగా.. తమ పార్టీ తరపున గెలిచిన వారు పార్టీ మారిపోతున్నా.. బీఆర్ఎస్ గట్టిగా డిఫెండ్ చేసకోలేకపోతోంది. ప్రజా మద్దతు కూడగట్టుకోలేకపోతోంది. చివరికి పోతే పోయారు.. మనకు కార్యకర్తలు ఉన్నారని అనుకుంటున్నారు. రాజకీయాలు రివర్స్ అవడానిక ఐదేళ్లు చాలు. ఈ సూక్ష్మాన్ని గుర్తించడంలో రాజకీయ పార్టీలు విఫలం కావడంతోనే అసలు సమస్య వస్తోంది.
గులాబీకి దక్కని సానుభూతి…
- Advertisement -
- Advertisement -