Monday, December 23, 2024

తమ్మినేని ఇక పొలిటికల్ రిటైర్మెంట్

- Advertisement -

శ్రీకాకుళం,నవంబర్ 22, (వాయిస్ టుడే): అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైందని రాజకీయ పరిశీలకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజల అసంతృప్తి,  జగన్ సర్కార్ కక్ష పాధింపు పాలనపై పెల్లుబుకుతున్న ఆగ్రహానికి తోడు  తెలుగుదేశం, జనసేన కలిసి కదులుతుండటంతో వైసీపీకి ఇప్పుడు ఓటమి తప్ప మరో అప్షన్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు. ఇప్పటికే పలు సర్వేలు వైసీపీకి  ఘోర పరాజయం తప్పద పేర్కొన్నాయి.  మాకు తిరుగే లేదని.. మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అందలం ఎక్కిస్తాయని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ మధనపడిపోతున్నారనీ, ఆందోళన చెందుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఈ  నేపథ్యంలో  వైసీపీ రకరకాల ఎత్తులు వేసి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే భారీ స్థాయిలో సిట్టింగులను మార్చేయాలని భావిస్తోంది. అది కూడా ఉత్తరాంధ్రలో ఈ అభ్యర్థుల మార్పుపై విషయంలో భారీ కసరత్తే జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   కోస్తాంధ్రలో పప్పులు ఉండకవన్న భావనకు వచ్చేసిన వైసీపీ.. ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  అందుకే ఎలాగోలా ఎన్నికల సమయానికి విశాఖ నుండి సీఎం పరిపాలన ప్రారంభించేయాలని నానా హడావుడీడ పడింది. అయితే అది ఆచరణ  సాధ్యం అవుతుందా అంటే పరిశీలకుల నుంచే కాకుండా, న్యాయనిపుణుల నుంచి కూడా అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది. విశాఖ పరిపాలనా  రాజధాని  అన్న హామీతో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ, మరీ ముఖ్యంగా జగన్ భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే సిట్టింగులపై వ్యక్తమౌతున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత ప్రభావం తగ్గించుకునేందుకు  కొత్త అభ్యర్థులను బరిలో ఉంచాలని యోచిస్తున్నదని అంటున్నారు. ఇందులో భాగంగా పలువురు ఎంపీలను అసెంబ్లీ బరిలో దించడం, పలువురు ఎమ్మెల్యేలకు  స్టీట్ల మార్పు వంటి చర్యలపై జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇక కొంతమంది సిట్టింగులకు రిక్తహస్తం చూపే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు.  ఈ క్రమంలోనే ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఈసారి టికెట్ కేటాయించేందుకు వైసీపీ పెద్దలు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. తమ్మినేని సిట్టింగ్ స్థానం ఆముదాల వలసలో ప్రస్తుతం వైసీపీ మరో కొత్త మొహం కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలలో తమ్మినేని కూడా ఒకరన్న నిశ్చితాభిప్రాయానికి జగన్ వచ్చేశారని అంటున్నారు. అందుకే వైసీపీ ముందుగా ఆయనను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించాలని భావించింది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని భావించినా, ప్రజాభిప్రాయం ఆయనకు వ్యతిరేకంగా ఉందనీ, ఆయన గెలిచే అవకాశాలు మృగ్యమనీ అంతర్గత సర్వేలో తేలడంతో ఇక తమ్మినేనిని పూర్తిగా పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లు చెబుతున్నారు.  తమ్మినేనికి రాజ్యాంగ బద్దమైన పదవి దక్కినా ఆయన ఆ పదవికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించారన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే.  వేదికలపైనే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రతిపక్షాలపై ఆయన ప్రవర్తించిన తీరు, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ సభ్యుల దౌర్జన్యాలను ప్రోత్సహించడం వంటి సంఘటనలు ఆయన ప్రతిష్టను పూర్తిగా మసకబార్చేశాయి.  అలాగే ఎమ్మెల్యేగా కూడా ఆయన ప్రజల నుంచి వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలవడం అసాధ్యంగా మారిపోయిందని వైసీపీ అగ్రనాయకత్వానికి తేటతెల్లమైపోయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.అంతే కాకుండా దీనికి తోడు ఒకసారి స్పీకర్ గా పనిచేసిన నేతలు మళ్ళీ రాజకీయాల్లో రాణించలేరన్న సెంటిమెంట్  పరంగా చూసినా కూడా ఇక తమ్మినేనికి వైసీపీ బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి ప్రతిభా భారతి స్పీకర్ గా పనిచేసిన అనంతరం అనేక ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత స్పీకర్ గా పనిచేసిన యనమల రామక్రిష్ణుడు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అయితే చంద్రబాబు ఆయన సేవలు నచ్చి ఎమ్మెల్సీగా చేసి కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే. స్పీకర్ నుండి సీఎం అయితే కాగలిగారు కానీ మళ్ళీ గెలవలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తర్వాత పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తమ్మినేని సీతారాం పరిస్థితి కూడా అదేనని అంటున్నారు. ఓడిపోతారని తెలిసీ టికెట్ ఇవ్వడం కంటే టికెట్ నిరాకరించి బలవంతపు రిటైర్మెంట్ ఇవ్వడమే మేలని వైసీపీ తమ్మినేని సీతారాంను పూర్తిగా పక్కన పెట్టేసిందని చెబుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్