50 లక్షల టన్నుల బియ్యానికి ఓకే
హైదరాబాద్, ఆగస్టు 23: ఏటా కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యాన్ని సేకరిస్తుంది. రాష్ట్రాల పంట దిగుబడిని బట్టి కేంద్రం బియ్యాన్ని సేకరిస్తుంది. ఈసారి కూడా రాష్ట్రాల నుంచి బియ్యం సేకరణకు కేంద్రం కోటా కింద టార్గెట్ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్‌లో వచ్చే వరి దిగుబడి నుంచి 50 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ నిర్ణయించింది. సోమవారం దిల్లీలో ఈ అంశంపై సమావేశం జరిగింది. బియ్యం సరఫరా ఉన్న రాష్ట్రాల అధికారులతో చర్చలు నిర్వహించారు. తెలంగాణ నుంచి ఈ వానాకాలంలో కోటి 52 లక్షల టన్నుల ధాన్యం పంట వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పంటను మిల్లింగ్ చేస్తే దాదాపు 67 లక్షల బియ్యం వస్తుంది. ఈ బియ్యం మొత్తాన్ని కేంద్రం సేకరించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మాత్రం తెలంగాణ నుంచి 50 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం వానా కాలం సాగు, పంట దిగుబడి ఎంత వస్తుందనే అంశంపై అంచనాలు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెలలో ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ బియ్యం సేకరణపై వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అంచనాలు మాత్రం వెలువడించింది.దేశ వ్యాప్తంగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వర్షపాతం అనుకూలించడంతో పలు రాష్ట్రాల్లో కలిపి వరి సాగు విస్తీర్ణం దాదాపు 15 లక్షల హెక్టార్ల మేర పెరగగా.. అందులో 30 % వాటా తెలంగాణదే. ఇందులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. కాబట్టి రాష్ట్రంలో వరి పంట దిగుబడి అధికంగానే ఉంటుందని అంచనా ఉంది. గత సంవత్సరం ఖరీఫ్‌లో కూడా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెంగాణ నుంచి 50 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ముందుకు వచ్చింది. కానీ రాష్ట్రం 44 లక్షల టన్నుల బియ్యం పౌర సరఫరాల సంస్థ ఇవ్వగలిగింది.