అన్ని స్కూళ్లలో తెలుగు కంపల్సరీ
హైదరాబాద్, ఫిబ్రవరి 25, (వాయిస్ టుడే)
Telugu is compulsory in all schools
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా బోధించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు తెలుగు తప్పనిసరిగా సబ్జెక్టుగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తరగతి విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతి విద్యార్ధులకు 2026-27 నుంచి ఈ అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది.కాగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే, గత ప్రభుత్వం వివిధ కారణాల వల్ల పాఠశాలల్లో తెలుగు బోధనను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. రాష్ట్రంలో గతేడాది అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు అమలుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకువచ్చింది. తదనుగుణంగా యాజమాన్యంతో సమావేశం నిర్వహించి, రాబోయే విద్యా సంవత్సరం నుంచి CBSE, ICSE వంటి ఇతర బోర్డు స్కూళ్లలో కూడా 9, 10 తరగతులకు తెలుగు సబ్జెక్టును బోధించాలనే నిర్ణయాన్ని తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది.అయితే బోర్డు విద్యార్థులకు తెలగు సబ్జెక్టును సులభంగా బోధించడానికి ‘వెన్నెల’ అనే ‘సరళ తెలుగు’ పాఠ్యపుస్తకాన్ని ఉపయోగించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం తెలిపారు. ‘సరళ తెలుగు’ పాఠ్యపుస్తకాన్ని అమలు చేయడం వల్ల తెలుగు మాతృభాషగాలేని విద్యార్థులకు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
సింగిడి స్థానంలో వెన్నల
ఇతర సిలబస్ స్కూళ్లలోనూ 100 శాతం తెలుగు సబ్జెక్ట్ అమలు లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘సింగిడి’ పుస్తకాన్ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు ‘వెన్నెల’ తెలుగు పుస్తకాన్ని బోధించాలని తెలిపింది.ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల విద్యార్థులు తెలుగు సబ్జెక్టును సులభతరంగా అర్థమయ్యేలా ‘వెన్నెల’ విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. దీంతో ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం 2025–26 నుంచి అమలు చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. దీని ఆధారంగా పరీక్షను నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మెమో ద్వారా పాఠశాల యాజమాన్యాలను ఆదేశించింది.ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూద్దాం. విద్యార్థుల స్కోర్ కోసం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి కొన్ని పాఠశాలలు సంస్కృతం సబ్జెక్ట్ పక్కాగా అమలు చేశాయి. దీనివల్ల విద్యార్థుల మార్కులు పెరుగుతుందని భావించారు. చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఫాలో అవుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. మధ్యలో తెలుగు సబ్జెక్ట్ అంటే కష్టంగా ఉంటుందని అంటున్నారు.మళ్లీ మొదట నుంచి తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు కొందరు స్టూడెంట్స్. సంస్కృతం సబ్జెక్ట్ తీసుకున్న విద్యార్థుల సంఖ్య ప్రైవేటు పాఠశాలలో ఎక్కువగా ఉందని అంటున్నారు. చాలా పాఠశాలలను ఐదు నుంచి అమలు చేయడం మొదలుపెట్టారు. నార్మల్‌గా అయితే ఇంటర్‌లో స్కోర్ కోసం సంస్కృతం సబ్జెక్ట్‌ను విద్యార్థులు ఎక్కువగా తీసుకున్న సందర్భాలు కనిపిస్తాయి. దీనివల్ల వందకు వంద స్కోర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.