Sunday, September 8, 2024

 కాళేశ్వరం రింగ్ మాస్టర్ లో టెన్షన్

- Advertisement -

 కాళేశ్వరం రింగ్ మాస్టర్ లో టెన్షన్
కరీంనగర్, డిసెంబర్ 23,
కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన రింగ్‌ మాస్టర్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.నిరంజన్‌ తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంతో ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందోనని రింగ్‌మాస్టర్‌లో ఆందోళన మొదలైంది.కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీకి చెందిన కేంద్రస్థాయి అగ్రనేతలతో పాటు, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతకాలంగా భారీ ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 1.25 లక్షల కోట్ల రూపాయల వ్యయ అంచనాతో భారీ స్థాయిలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఇప్పటిదాకా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పెట్టుబడిలో భాగంగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నాబార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఆర్థిక సంస్థలు దాదాపు 86 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేసి, ఇందులో అత్యధిక భాగం విడుదల చేశాయి. ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తవడంతో, ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు చెల్లించారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఆరోపణలు చేసినట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే.. దీని మూలంగా నష్టపోయింది ప్రభుత్వ ధనం, ప్రజాధనం మాత్రమే. ఈ అప్పులు తీర్చాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. దీంతో, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు డిజైనింగ్‌లో, ఇటు ఈ ప్రాజెక్టును వివిధ ప్యాకేజీలుగా విభజించడంలో, అంతిమంగా నిర్మాణ కాంట్రాక్టులో సింహభాగం పొందడంలో రింగ్‌మాస్టర్‌ పోషించిన పాత్రపై సహజంగానే అందరి దృష్టి పడింది.సిబిఐ విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేయడంతో పాటు, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో, ఏఏ లొసుగులు బయటకు రానున్నాయనే ఆందోళన కొందరిలో మొదలైంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
– ప్రాజెక్టు డిజైన్‌లో ఇంజనీరింగ్ పరంగా కీలక పాత్ర పోషించింది ఎవరు?
– ఈ ప్రాజెక్టు టెండర్ల నిబంధనలను రూపొందించడంలో, ప్రాజెక్టును వివిధ ప్యాకేజీలుగా విభజించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు?
– ఈ ప్రాజెక్టు కాంట్రాక్టులో సింహభాగం దక్కించుకున్నది ఎవరు ?
– ఇరిగేషన్ శాఖ అధికారులు కొందరితో కుమ్మక్కై.. వారికి వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చారనే ఆరోపణలు బయటపడటంతో, ఉలిక్కిపడింది ఎవరు ?
– అంతిమంగా.. ఈ ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగిందా? ఒకవేళ.. ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరిగితే.. ఈ మొత్తం వ్యవహారంలో రింగ్‌మాస్టర్‌ పాత్ర ఏంటనేది, ఈ రింగ్‌మాస్టర్‌ ఏ స్థాయిలో ప్రయోజనం పొందారన్నది బయటకు రానుంది.తాజా పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్న రింగ్‌మాస్టర్‌.. వ్యవహారం తమ చేయిదాటి, అంతిమంగా తమ మెడకు చుట్టుకుంటుందేమోనన్న భయంతో ఉన్నారు. వివిధ స్థాయిల్లో తమకున్న పరిచయాలను, పలుకుబడిని ఉపయోగించి.. ఏదోలా దీన్నుంచి బయటపడే మార్గాలపై రింగ్ మాస్టర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.రాజకీయంగా అత్యంత సునిశితంగా, ప్రధానంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలకు సంబంధించి, మున్ముందు జరుగనున్న పరిణామాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. సీబీఐ విచారణతోపాటు, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ తన పిటిషన్‌లో పేర్కొనడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్