హైదరాబాద్, ఆగస్టు 16: వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకదన్న ఓ మహిళకు.. కట్టుకున్న భర్తే కాలేయం దానం చేసి కాపాడుకున్నాడు. పొత్తి కడుపులో నొప్పితో ఐదేళ్లుగా బాధపడుతున్న 39 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఓ ఆసుపత్రిలో భర్త లివర్ దానంచేసి ప్రాణం పోసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ సుల్తానా పొత్తికడుపులో నొప్పితో పాటు కామెర్లు ఉండి నెల కిందట ఫిట్స్ రావడంతో బెడ్‌కే పరిమితమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కోమాలోకి వెళ్లిన తీరుతో ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారం మించి బతకదని చెప్పినట్లు, దాంతో వారు లక్డీకపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రికి తీసుకోచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి లోని వైద్యుల బృందం నేతృత్వంలో రోగిని పరిశీలించగా క్రోనిక్ లివర్ ఫెయిల్యూర్‌గా గుర్తించారు. అనంతరం ఎవరైనా దాతలు లివర్ ఇస్తే ఆమె బ్రతుకుతుందని వైద్యులు తెలిపారు. దీంతో భర్త మహమ్మద్ లియాఖత్ లివర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అనంతరం కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిందని వెల్లడించారు. పడకకు పరిమితం అయిన ఆమె పది రోజుల్లో కోలుకుని నడవడం ప్రారంభించారని వైద్యులు తెలిపారుప్రస్తుతం ఆమె కోలుకోవడంతో పాటు తన పనులు తాను చేసుకునే స్థితికి చేరిందని తెలిపారు. లివర్ దాతలకు ఆరు వారాల్లో రికవరీ అవుతుందని కుటుంబంలో ఎవ్వరికైనా లివర్ ఇవ్వాల్సి వస్తె ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావాలని వైద్యులు కోరారు. బ్లెడ్ గ్రూప్ కలిస్తేనే దానం చేయడానికి వీలవుతుందని వివరించారు. తాను బ్రతుకుతానని అనుకోలేదని తన భర్త ధైర్యంగా ముందుకు వచ్చి కాలేయం ఇచ్చేందుకు ముందుకు రావడంతో వైద్యుల కృషి వల్ల తాను ప్రాణాలతో బతికే బయటపడ్డానని ఆప్రిన్ సుల్తానా తెలిపింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తన భార్యను కాపాడినందుకు వైద్యులకు కన్నీరు తో భర్త మహమ్మద్ లియాఖాత్ కృతజ్ఞతలు తెలిపారు.