
ఈ మాసము ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం ఆగస్టు 17 వ తేదీ నుండి ప్రారంభమైంది. శ్రావణ మాసం ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి.
శ్రావణ మాసం నందు ప్రతి మంగళవారం , శుక్రవారం ఆడవారు నోములను విశేషంగా ఉత్సహంగా పేరంటాలు జరుపుకుంటూ అత్యంత భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు.
సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగిన మాసం శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.

వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు , శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు , వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం , అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి…



