కమలంలో ఇమడ లేకపోతున్న ఈటెల
హైదరాబాద్, జూలై 2,
ఈటల రాజేందర్ మావోయిస్టు ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రి అయ్యారు. బీఆర్ఎస్ లో ఉద్యమకాలం నుంచి పనిచేసి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు కూడా కేసీఆర్ ఈటల రాజేందర్ కు ప్రయారిటీ ఇచ్చారు. శాసనసభలో పార్టీ నేతగా అవకాశం కల్పించారు. అలా ఈటల రాజకీయ ప్రస్థానం మొదలయింది. 2014లో బీఆర్ఎస్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు ఉద్యమం నుంచి రావడం, మంచి వాగ్దాటి ఉండటంతో ఆయనకు అవకాశాలు అనుకోకుండానే తరముకుంటూ వచ్చాయంటారు. అయితే 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ కు, కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది. పార్టీ నాయకత్వంపైనే నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ తప్పించారు. వెనువెంటనే పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల అప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో విజయం సాధించారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోనూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలన్నది ఈటల రాజేందర్ కోరిక లా ఉంది. అయితే ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాళ్లు, కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నేతలు అనేక మంది ఉన్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి రెండుచోట్ల పోటీ చేసిన ఈటల రాజేందర్ ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన తిరిగి పదవిలో ఉండేందుకు లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆయన కోరుకున్నట్లుగానే మల్కాజ్‌గిరి నియోజకవర్గం అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసింది. అప్పటి వరకూ ఉన్న నేతలను పక్కన పెట్టి అధినాయకత్వం ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. మొత్తం మీద ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నియోజకవర్గం ఎంపీగా గెలిచారు. అయితే ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. కానీ మోదీ సర్కార్ లో మాత్రం ఆయన ఆశించింది జరగలేదు. కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ను మోదీ తీసుకున్నారు. కె. లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలున్నప్పటికీ వాళ్లిద్దరూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని భావించి మోదీ వాళ్లిద్దరికే కేబినెట్ లో చోటు కల్పించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్ ఆశిస్తున్నట్లు కనపడుతుంది. మంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో అధికారంలోకి మళ్లీ రావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవి కోసం అనేక పేర్లు వినిపిస్తున్నాయి. డీకే ఆరుణ, ధర్మపురి అరవింద్ వంటి పేర్లు కూడా వినిపిస్తుండటంతో ఈటల కొంత అసహనం ఫీలవుతున్నారని ఆయన మాటలను బట్టి వ్యక్తమవుతుంది. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ బీజేపీ అధ్యక్షుడిగా ఏ ఫైటర్ కావాలి.. స్ట్రీట్‌ఫైటరా.. రియల్ ఫైటరా.. అంటే ప్రశ్నించారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానంటూ తనకు తానే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని అంటూ మిగిలిన నేతలను కించపర్చే విధంగా మాట్లాడటంపై కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మొత్తం మీద ఈటల రాజేందర్ ఇక్కడ కూడా ఇమడలేకపోతున్నట్లే కనిపిస్తుంది.
కమలంలో ఇమడ లేకపోతున్న ఈటెల
- Advertisement -
- Advertisement -